
ప్రై‘వేటు’కు సై
ప్రజల నుంచి పలు రకాల ఫీజులు, పన్నులు వసూలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ.. వాటిలో రూ.1500 కోట్ల వసూళ్ల బాధ్యత ను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి కట్టబెట్టేందుకు సిద్ధమైంది.
సాక్షి, సిటీబ్యూరో : ప్రజల నుంచి పలు రకాల ఫీజులు, పన్నులు వసూలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ.. వాటిలో రూ.1500 కోట్ల వసూళ్ల బాధ్యత ను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి కట్టబెట్టేందుకు సిద్ధమైంది. తద్వారా వసూళ్లు పెంచుకోవడంతో పాటు, అవినీతికి పాల్పడుతున్న సిబ్బంది ఆట కట్టించవచ్చునని భావిస్తోంది. ఇందుకు టెండర్లు పిలిచింది. వచ్చేనెల 13వ తేదీ గడువుగా విధించింది. కాగా కీలకమైన వసూళ్ల బాధ్యతను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగిస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయంలో సొంత సిబ్బందినే అదుపు చేయలేని అధికారులు.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఎలా నియంత్రిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో గ్లోసైన్‌బోర్డుల నుంచి
ప్రకటనల ఫీజుల వసూళ్ల బాధ్యతను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చి చేతులు కాల్చుకున్న జీహెచ్‌ఎంసీ.. మళ్లీ ప్రైవేటు మంత్రం పఠించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సు ఫీజు, అడ్వర్టయిజ్‌మెంట్ టాక్స్, ఎస్టేట్స్ విభాగంలోని షాపుల అద్దెలు, వృత్తిపన్ను తదితరాలన్నీ జీహెచ్‌ఎంసీయే వసూలు చేస్తోంది. వీటి ద్వారా ఏటా రూ. 1500 కోట్లు రావాల్సి ఉండగా, దాదాపు రూ. 800 కోట్లే వసూలవుతున్నాయి. అవకతవకలకు పాల్పడుతున్న కొంతమంది సిబ్బంది కారణంగా ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందనే అనుమానాలున్నాయి. ఆస్తిపన్ను అసెస్‌మెంట్లు, ట్రేడ్ లెసైన్సు ఫీజుల ఖరారులో భవనాలు, సంస్థల యాజమాన్యాలతో సిబ్బంది కుమ్మక్కవుతూ, జీహెచ్‌ఎంసీ ఖజానాకు చిల్లు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. మరోైవె పు, ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మునూ పక్కదారి పట్టిస్తున్న ఘటనలు సైతం గతంలో వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో.. ఫీజుల వసూళ్లకు ఔట్‌సోర్సింగ్ సంస్థకు తగిన కమీషన్ చెల్లించడమే మేలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. తద్వారా ఎంతోమంది సిబ్బందిని ఇతర పనులకు వినియోగించవచ్చని కూడా భావిస్తోంది.
విధి విధానాలివీ...
ఫీజుల వసూళ్లకు వీలుగా జీహెచ్‌ఎంసీలోని 5 జోన్లను 334 డాకెట్లుగా విభజించారు.
ఒక్కో డాకెట్‌లో దాదాపు 4 వేల ఆస్తులున్నాయి. వీటి నుంచి 5 రకాల ఫీజులు వసూలు చే స్తారు.
ఐదు రకాల ఫీజుల వసూళ్లకూ హెచ్‌హెచ్‌డీ లనే వినియోగిస్తారు.
ఒక్కో డాకెట్‌కు ఒకరుచొప్పున తొలుత వందమంది బిల్‌కలెక్టర్లను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ నియమిస్తుంది.
వీరికి గుర్తింపుకార్డుల్ని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు జారీ చేస్తారు.
వారి జీతాల చెల్లింపులు తదితరమైనవన్నీ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీయే చూస్తుంది.
గత మూడేళ్లలో రూ. 15 కోట్ల టర్నోవర్ కలిగి, అనుభవమున్న సంస్థలకే టెండరులో పాల్గొనే అర్హత.
ఒకే సంస్థకు అన్ని అర్హతలు లేకుంటే రెండు సంస్థలు కలిసి కన్సార్షియంగా టెండరులో పాల్గొనవచ్చు.
ఏజెన్సీ వసూలు చేసే సొమ్ములో 2 శాతం లేదా రూ. 2వేలలో ఏది తక్కువైతే అదే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు కమీషన్.
ఏజెన్సీ వసూలు చేసే పన్నులు, ఫీజులు ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ ఖజానాలో జమ చేయాలి.
సెల్‌ఫోన్ రీచార్జి కూపన్ల మాదిరిగా హెచ్‌హెచ్‌డీలను రీచార్జి చేస్తారు. ఉదాహరణకు ఒక హెచ్‌హెచ్‌డీ పనిచేయాలంటే ముందస్తుగా రూ.లక్ష జీహెచ్‌ఎంసీకి డిపాజిట్ చేయాలి. అప్పటి నుంచి రూ.లక్ష మేర బిల్లులు జారీ చేసేంత వరకు ఆ డివైజ్ పనిచేస్తుంది. తర్వాత ఆగిపోతుంది.
ఒక్కో జోన్‌కు రూ. 5 లక్షలు ప్రీపెయిడ్‌తో ఈ విధానాన్ని అమలు చేస్తారు.
ఏజెన్సీకి చెందిన బిల్ కలెక్టర్ బిల్లు వసూలు చేసిన భవనం ఫొటో కూడా తీయాలి. జీపీఆర్‌ఎస్ కనెక్షన్‌ను వినియోగించాలి.
కొత్త భవనాలు, వ్యాపారాలు గుర్తిస్తే.. వాటిని పన్ను పరిధిలోకి తెచ్చే బాధ్యత కూడా ఈ బిల్ కలెక్టర్లదే
బిల్లు వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశాన్ని కాంట్రాక్టు ఏజెన్సీ ప్రకటనల కోసం వాడుకోవచ్చు.
వసూళ్లు ఇలా..
ఫీజులు/పన్నులు వసూలు చేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వాటిని దారి మళ్లించకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఫీజులు/పన్నులు వసూలు చేసే ఏజెన్సీ హ్యాండ్‌హెల్డ్ డివైజ్(హెచ్‌హెచ్‌డీ)లు వినియోగించాలి. వాటిల్లో ఏ ఆస్తి ద్వారా ఎంత ఆస్తిపన్ను రావాలో.. లేదా ఎస్టేట్స్ విభాగంలోని ఏ దుకాణం నుంచి ఎంత అద్దె బకాయి ఉందో, ఏ ట్రేడ్ నుంచి ఎంత లెసైన్సు ఫీజు రావాలో వివరాలుం టాయి. సంబంధిత నెంబరును ఎంట్రీ చేయగానే ఎంత బకాయి ఉందో తెలుస్తుంది. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఇష్టానుసారం ఫీజులు, బకాయిలు నిర్ణయించకుండా ఉండేందుకు ఇది ఉపకరిస్తుంది. దీంతోపాటు, వసూలు చేసిన ఫీజు లేదా పన్నుకు సదరు కంప్యూటర్ నుంచే రసీదు ఇస్తారు. ఆ వివరాలు వెంటనే కార్యాలయాల్లోని ఉన్నతాధికారులకు కూడా తెలుస్తాయి.