ఖాకీల భూదందా!
సంగారెడ్డిలో భూ వివాదంలో రాచకొండ అడిషనల్ డీసీపీ
- నిర్బంధించి రూ.60 లక్షల చెక్‌లపై సంతకం
- సహకరించిన మరో ముగ్గురు పోలీసులు
- బాధితుడి ఫిర్యాదుతో పోలీసులపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: భూసెటిల్‌మెంట్ వ్యవహారంలో బాధితుడిని నిర్బంధించి..రూ.60 లక్షల చెక్కులపై బలవంతంగా సంతకాలు పెట్టించుకున్న కేసులో రాచకొండ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ పులిందర్‌రెడ్డిపై కేసు నమో దైంది. ఇందులో అతనికి సహకరించిన రాయ దుర్గం ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణలపైనా సైబ రాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదేశాలతో కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
అడ్వాన్సులిచ్చి కాలయాపన...
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ముత్తంగి గ్రామంలో ఇరువురు రైతులకు ఎకరం భూమి ఉంది. దీన్ని కొనుగోలు చేస్తానంటూ వారిని సంప్రదించిన ముజీబ్.. రూ.కోటికి ఒప్పందం కుదుర్చుకుని, రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. మిగిలిన డబ్బులివ్వకుండా ముజీబ్ కాలం వెళ్లదీస్తున్నాడు. అదే సమయంలో రియల్‌ఎస్టేట్ బ్రోకర్ అబూబకర్, అతని సోదరుడు అబ్దుల్లా ఆ భూమిని రూ.కోటికి కొంటామని రైతులను సంప్రదించారు. ముజీబ్ ఇచ్చిన అడ్వాన్స్‌ను తాము అతనికి చెల్లిస్తామని రైతులను ఒప్పించారు. అండగా ఉంటాడని తనకు పరిచయమున్న రాచకొండ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ పులిందర్‌రెడ్డికి విషయాన్ని చెప్పాడు అబూబకర్. భవిష్యత్తులో తలనొప్పులు రాకుండా ఉండేందుకు అగ్రిమెంటులో తన కుమార్తె ఐశ్వర్యారెడ్డి పేరునూ చేర్చాలని పులిందర్ సూచించాడు. అందుకు ఓకే అన్న అబూబకర్.. రైతులకు రూ.20 లక్షలు చెల్లించి, అగ్రిమెంటులో ఐశ్వర్య పేరూ రాయించాడు.
అయితే ఎన్ని రోజులవుతున్నా మిగిలిన డబ్బు సమకూరక అబూబకర్ సోదరులు రైతుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలో సదరు భూమిని కొనుగోలు చేస్తా మని వచ్చిన గంగాధర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలతో రూ.1.10 కోట్లకు రైతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సమయంలో ముజీబ్ ఇచ్చిన అడ్వాన్స్ రూ.10 లక్షలకు అదనంగా రూ.15 లక్షలు, అబూబకర్ సోదరులు ఇచ్చిన రూ.20 లక్షలకు అదనంగా రూ.10లక్షలు కలిపి గంగా ధర్, రవీందర్ వారికి చెల్లించారు. మిగిలింది రైతులకు ఇచ్చేసి అంతా క్లియర్ చేసుకున్నారు.
మరో రూ.75 లక్షలొచ్చేవి..!: విషయం తెలుసుకున్న పులిందర్‌రెడ్డి రంగంలోకి దిగా డు. తనకు తెలియకుండానే రైతుల నుంచి అడ్వాన్స్ వెనక్కి ఎందుకు తీసుకున్నావంటూ అబూబకర్‌పై ఫైరయ్యాడు. అక్కడ ఎకరం దాదాపు రూ.2కోట్లు పలుకుతుందని, అడ్వా న్స్ తిరిగివ్వకుంటే మరో రూ.75 లక్షలు వచ్చే వని వాపోయాడు. అగ్రిమెంటు చేసుకున్న అబూబకర్ తనను మోసం చేశాడంటూ కుమా ర్తె ఐశ్వర్యారెడ్డితో పులిందర్‌రెడ్డి జూలై 25న రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయించాడు. మరుసటి రోజు ఉదయం 9కి పుప్పాలగూడ లో ఉండే అబూబకర్ ఇంటికి మరికొంతమంది తో వెళ్లిన పులిందర్‌రెడ్డి.. అతడిని రాయదుర్గం ఠాణాకు తీసుకొచ్చాడు. రాత్రి 10 వరకు స్టేషన్‌లోనే నిర్బంధించి రూ.60 లక్షల విలువైన ఐదు చెక్కులు, తెల్లకాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించాడు. అబూబకర్ వద్దనున్న రూ. 49 వేల నగదు కూడా లాక్కుని వదిలేశాడు.
ఫిర్యాదుతో వెలుగులోకి..
దీనిపై అబూబకర్ శనివారం సైబరా బాద్ సీపీ సందీప్‌శాండిల్యను కలసి ఫిర్యా దు చేశాడు. సీపీ ఆదేశాలతో పులిందర్‌రెడ్డితో పాటు, మరో ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితుడు పీఎస్‌కు వచ్చి వెళ్లిన సమయమంతా సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఏసీపీ రమణకుమార్‌ను విచా రణాధికారిగా నియమించారు. 2015లో సైబరాబాద్‌లో ట్రాఫిక్ అడిషనల్ సీపీగా ఉన్న సమయంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పులిందర్‌రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.