బంగారం షాపులపై కేసులు
‘నోట్ల రద్దు’ తర్వాత భారీ విక్రయాలపై ఐటీ శాఖ ఫిర్యాదులు
- ముసద్దీలాల్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్‌పై కేసులు నమోదు
- దర్యాప్తు బాధ్యతలు సీసీఎస్‌కు బదిలీ చేసే యోచన
హైదరాబాద్: నోట్ల రద్దు ప్రకటన వెలువడగానే నల్ల ధనాన్ని బంగారంలోకి మళ్లించేందుకు సహకరించిన జ్యువెలరీ దుకాణాలపై కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ 8న రాత్రికి రాత్రే పాత నోట్లతో ఏకంగా రూ.100 కోట్ల బంగారం అమ్మకాలు చేసిన ముసద్దీ లాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమి టెడ్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.2లో ఒకే ప్రాంగణంలో ఉన్న ఈ రెండు దుకాణాల్లో పాత రూ.1,000, రూ.500 నోట్లతో నిబంధనలకు విరుద్ధంగా భారీ వ్యాపారం జరిగినట్లు ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రెండు సంస్థలకు చెందిన డైరెక్టర్లు నితిశ్ గుప్తా, సీరా మల్లేశ్, నరేంద్రజి గెల్లబోయిన, వినూత బొల్ల తదితరులపై.. ఐపీసీ 420, 467, 468, 471, 474, 477(ఏ), 109, 120(బి) రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పెద్ద మొత్తంతో ముడిపడిన ఆర్థిక నేరం కావడంతో దర్యాప్తు బాధ్యతల్ని నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) అప్పగించడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మూడు రోజులు సోదాలు
నోట్ల రద్దు కారణంగా పెద్ద మొత్తంలో నగదు ఉన్నవారు భారీగా బంగారం కొనుగోళ్లు చేపట్టారు. ఇదే అదునుగా ఈ రెండు సంస్థలు అక్రమ వ్యాపారానికి తెరతీశాయి. బంగారాన్ని అధిక ధరకు విక్రయిస్తూ పాత నోట్లను తీసుకున్నాయి. నవంబర్ 8 రాత్రి నుంచి 9వ తేదీ తెల్లవారుజాము వరకు ఈ దందా కొనసాగించాయి. దీనిపై సమాచారం అందుకున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు.. మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించి, కీలక పత్రాలు, రసీదులను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ పరిశీలించి జ్యువెలర్స్ యాజమాన్యం నల్ల కుబేరులకు సహకరించినట్లు గుర్తించారు. నవంబర్ 8 రాత్రి నుంచి 9వ తేదీ తెల్లవారుజాము వరకు కేవలం 8 గంటల వ్యవధిలోనే 5,200 మంది వినియోగదారులకు రూ.100 కోట్ల విలువ చేసే ఆభరణాలను విక్రయించినట్లు ఆ రికార్డుల్లో ఉంది. దీనికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన ఐటీ అధికారులు భారీ గోల్‌మాల్ జరిగినట్లు తేల్చారు. ఈ దుకాణాల్లో పనిచేస్తున్న నర్సింగ్, బాషా, మల్లేశ్, నీల్ సుందర్, నిషా గుప్తా తదితర సిబ్బంది పాత నోట్లు తీసుకుని ఆభరణాల విక్రయాలు చేపట్టినట్లు గుర్తించారు.
కోట్లకు కోట్లు..
ముసద్దీలాల్ జ్యువెల్లర్స్ యాజమాన్యం పంజగుట్టలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో గత నెల 10న రూ.57.85 కోట్లు, 11న రూ.24.8 కోట్లు, 15న రూ.27.2 కోట్లు రద్దయిన నోట్లను జమ చేసింది. ఇక గత నెల 10న వైష్ణవి బులియన్ దుకాణం పేరిట జూబ్లీహిల్స్‌లోని యాక్సిస్ బ్యాంకులో కొత్త అకౌంట్ తెరిచి ఏకంగా రూ.40 కోట్ల పాత నోట్లను జమ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. సాధారణంగా సదరు వ్యాపారులు చెప్పినట్లు వందలాది మంది వినియోగదారులు ఒక్కసారిగా దుకాణాలకు వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారని.. కానీ వీరు అలా చేయలేదని పేర్కొన్నారు.