సంకెళ్లను తెంచుకొని.. | Caste, religion Rejecting the couple | Sakshi
Sakshi News home page

సంకెళ్లను తెంచుకొని..

Published Tue, Jan 27 2015 12:21 AM | Last Updated on Tue, Oct 2 2018 5:14 PM

సంకెళ్లను తెంచుకొని.. - Sakshi

సంకెళ్లను తెంచుకొని..

కుల, మతాలను తోసిరాజని ఒక్కటైన దంపతులు
మీకు అండగా ఉంటాం..
ధైర్యంగా అడుగేయండి  {పముఖుల పిలుపు

 
సిటీబ్యూరో: కట్టుబాట్లు.. ఆచార, సంప్రదాయాలు.. మూఢ విశ్వాసాలు లేని మానవతా పరిమళాల అన్వేషణకు.. కులాలు...మతాలకు అతీతంగా ఒక్కటైన జంటలవి. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర విలువలకు అర్థంగా నిలిచే జనవరి 26వ తేదీ అంటే ఆ జంటలకు ఎంతో మక్కువ. ఆ స్ఫూర్తితోనే వారంతా సోమవారం ఇందిరా పార్కులో  కలుసుకున్నారు. ‘కులాంతర,మతాంతర వివాహితుల వేదిక’ 43వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ యతిరాజులు, జస్టిస్ పి.ఎస్.నారాయణ, అరుణోదయ విమల, ప్రముఖ కవి నిఖిలేశ్వర్ తదితర ప్రముఖులంతా హాజరయ్యారు. వేదిక అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది సీఎల్‌ఎన్ గాంధీ ఈ  కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పాలకుల బాధ్యతలు, ప్రభుత్వాల కర్తవ్యనిర్వహణ, చట్టపరమైన భరోసా, సామాజిక భద్రత, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యత వంటి అనేక అంశాలను సభికులు ప్రస్తావించారు. వారు ఏమన్నారంటే...
 
రూ.లక్ష ప్రోత్సాహకానికి కృషి: మంత్రి ఈటెల

సమాజ ఒరవడికి, పోకడకు భిన్నంగా కులాలకు, మతాలకు అతీతంగా  ఒక్కటి కావడం గొప్ప విషయం. ప్రగతిశీల భావజాలంతో, ఆలోచనా విధానంతో కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన మా ప్రభుత్వంకచ్చితంగా మీకు అండగా నిలుస్తుంది. కుల,మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న దంపతులకు రూ.లక్ష నగదును ప్రోత్సాహకంగా అందించేందుకు కృషి చేస్తా. కులాల పేరిట  వివక్ష, అణచివేతలను అంతమొందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
 
ధైర్యంగా ముందుకు సాగండి: జస్టిస్ చంద్రకుమార్


కుల, మతాలకు అతీతమైన మీరు ధైర్యంగా ముందుకు సాగండి. అందరినీ ఎదురించి పెళ్లి చేసుకోవడం ఆషామాషీ కాదు. ఎన్నో ఇబ్బందులను, బాధలను, కష్టనష్టాలను అధిగమించి వచ్చారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాల్లో సైతం కుల, మతాలకు అతీతమైన వివాహాల ప్రస్తావన ఉంది. ఇప్పటికే కులాంతర,మతాంతర వివాహం చేసుకొన్న వాళ్లు, భవిష్యత్తులో అలాంటి పెళ్లిళ్లు చేసుకోబోయేవాళ్లు భయం, ఆందోళన లేకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీకు ఉచిత న్యాయ సహాయాన్ని, నైతిక బలాన్ని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

సమాజ అభివృద్ధి కోసమే చట్టాలు: జస్టిస్ చంద్రయ్య

నలభై ఏళ్లకు పైగా ఒక యజ్ఞంలాగా సాగుతున్న కృషి ఇది. చాలా సంతోషం. సమాజం ఒక్కో దశను అధిగమిస్తున్న కొద్దీ అనేక నూతన చట్టాలు ఉనికిలోకి వచ్చాయి. కులం, మతం కంటే ముందే వృత్తులు ఏర్పడ్డాయి. ఆ వృత్తుల ఆధారంగానే కులాలు, కట్టుబాట్లు, ఆచారాలు వచ్చాయి. కుల,మతాలకు అతీతంగా జీవించడం అనేది సమాజ అభివృద్ధిలో భాగమే.
 
డీజీ రామరాజు స్మారక అవార్డు ప్రదానం..
.
కుల నిర్మూలన కోసం కృషి చేస్తోన్న ఏపీ కుల నిర్మూలన సంఘం సభ్యులు టి.వి.దేవదత్, లక్ష్మీ దంపతులకు ఏటా ఇచ్చే డీజీ రామరాజు స్మార క అవార్డును అందజేశారు. ఈ అవార్డు కింద  రూ.10 వేల నగదు, జ్ఞాపిక బహూకరించారు. ఈ ఏడాది కుల,మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న వెంకటేశ్వర్లు-సంతోష, రవి-రాధ, మురళి-కృష్ణవేణి, రాజేష్-హర్షియా, మల్లేష్-మంగ    దంపతులను వేదికకు పరిచయం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement