‘అగ్రిగోల్డ్’ పై సీబీఐ విచారణ | CBI inquiry On "Agrigold ' | Sakshi
Sakshi News home page

‘అగ్రిగోల్డ్’ పై సీబీఐ విచారణ

Published Tue, Mar 29 2016 2:07 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

‘అగ్రిగోల్డ్’ పై సీబీఐ విచారణ - Sakshi

‘అగ్రిగోల్డ్’ పై సీబీఐ విచారణ

ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం వల్ల సర్వం కోల్పోయిన 40 లక్షల మంది బాధితులు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే రాష్ర్ట ప్రభుత్వం నిందితులకు కొమ్ముకాయడం అన్యాయమని ఆయన తూర్పారబట్టారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా హోంమంత్రి చినరాజప్ప స్టేట్‌మెంట్ ఇచ్చిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ‘సీఐడీ లెక్కల ప్రకారమే బాధితుల సంఖ్య 32 లక్షలు. ఏజెంట్లు 8 లక్షల మంది. డిపాజిట్లు, వడ్డీలు కలుపుకుంటే రూ.
 
 10 వేల కోట్ల కుంభకోణం. అంతటి ప్రాధాన్యత గలిగిన వ్యవహారంలో రాష్ర్టప్రభుత్వం తన చెప్పుచేతల్లో ఉండే సీఐడీ చేత తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపించి యాజమాన్యానికి వత్తాసు పలుకుతుండడం దుర్మార్గం’ అని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఇప్పటికే 100 మంది ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులు రోడ్డెక్కారు, ఏజెంట్లు ఊళ్లు వదిలి పారిపోయారు.. ఇక్కడేమో సీఐడీ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఒత్తిళ్లు తెచ్చి కేసును నీరుగారుస్తున్నారు’ అని జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు పదేపదే అడ్డుతగిలారు. చివరకు అగ్రిగోల్డ్ వ్యవహారంపై ప్రతిపక్షనేత సీబీఐ విచారణ డిమాండ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి వివరణా ఇవ్వకుండానే సభ మంగళవారానికి వాయిదాపడింది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఇంకా జగన్ ఏమన్నారంటే...

 సెబీ నోటీసు ఇచ్చినా పట్టించుకోలేదు
 ‘‘అగ్రిగోల్డ్ అక్రమాలు ఇప్పటివి కావు.. 1998 మార్చి 31నే సెబీ (స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పబ్లిక్ నోటీసు జారీచేసింది... అక్రమంగా డిపాజిట్లు సేకరించిన కంపెనీల పేర్ల జాబితా విడుదల చేసింది. అందులో అగ్రిగోల్డ్ 24వ పేరుగా ఉంది. అప్పట్లోనే ఈ సంస్థ రూ.13.35 కోట్లు డిపాజిట్లు సేకరించినట్టు నోటీసులో స్పష్టం చేసింది. అయినా సరే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. పైగా 2001లో అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యంతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం రూ.6,850 కోట్ల డిపాజిట్లు, మరో రూ.3,150 కోట్ల వడ్డీలు..అంటే సుమారు 10 వేల కోట్ల కుంభకోణం ఇది.. కానీ టీడీపీ సభ్యులు కొంతమంది ఇది తమ హయాంలో జరిగింది కాదంటూ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలికొదిలారు. ప్రతిపక్షంలో ఉండగా ఆందోళనలకు సంఘీభావం తెలిపిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దోషులను శిక్షించే బదులు కాపాడుతున్నారు.

 రూ.2,460 కోట్ల శారదా స్కాం సీబీఐకి అప్పగించలేదా...
 పశ్చిమబెంగాల్‌లో జరిగిన శారదాస్కాం రూ.2,460 కోట్లు మాత్రమే. దీనిపై అక్కడి ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించింది. కానీ ఇక్కడ రూ.10 వేల కోట్ల స్కాం జరిగింది.. అయినా ఎందుకు సీబీఐ చేత విచారణ జరిపించరు? 40 లక్షల మంది బాధిత కుటుంబాలు వీధికెక్కి న్యాయం చేయండంటూ ప్రాథేయపడుతూంటే సీబీఐ చేత విచారణ జరపడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఓవైపు సీఐడీ అధికారులే అగ్రిగోల్డ్ కుంభకోణానికి సంబంధించిన నిందితులను అరెస్టు చేయనవసరం లేదని చెబుతున్నట్టు వార్తలొస్తూంటే బాధితులకూ ఏవిధంగా న్యాయం జరుగుతుంది? చివరకు అగ్రిగోల్డ్ బాధితులు సంక్షేమ సంఘంగా ఏర్పడి కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్నిబట్టి అగ్రిగోల్డ్‌పై సర్కారు వ్యవహారం ఎలా ఉందో చూడవచ్చు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై 24.12.2014నే నెల్లూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మొట్టమొదటగా కేసు రిజిస్టర్ అయ్యింది. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్తుందని, కోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే మొత్తం డొంకంతా కదులుతుందని భయపడ్డారు. అందుకే 5.1.2015న సీఐడీ విచారణకు ఆదేశించారు. అదన్నా సరిగ్గా జరుగుతున్నదా అంటే అదీ లేదు. సీఐడీ అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. ఆయన ఒత్తిడి ఫలితంగానే అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయనవసరం లేదని సీఐడీ అధికారులు పదేపదే హైకోర్టుకు చెబుతున్నారు.

 జీవో నం.23లో అన్ని ఆస్తులూ లేవెందుకు?
 అగ్రిగోల్డ్ కేసు విచారణ సరిగ్గా జరగడం లేదంటూ కోర్టులే ఆక్షేపిస్తున్న నేపథ్యంలో అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేస్తూ 2015 ఫిబ్రవరి 20 జీవో నం.23 విడుదల చేశారు. కానీ కొన్ని ఆస్తులు మాత్రమే అటాచ్‌మెంట్‌లో పెట్టారు. విచారణ జరుగుతూండగానే అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సీతారాం ఆవాస్ తిరుపతిలో మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ స్థలాన్ని (ఒక ఎకరా 12 సెంట్లు) 2015 ఆగస్ట్ 10న రూ.14 కోట్లకు అమ్మేశారు. ఈ స్థలం కూడా అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన అటాచ్‌మెంట్‌లలో లేదు. సీతారాం ఆవాస్‌ను అరెస్టూ చేయలేదు. అంటే దీని వెనకాల ప్రభుత్వం అండ ఉందనే కదా అర్ధం?

 ప్రత్తిపాటి భార్య భూములు కొన్నారు..
 అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్ ఈ జీవో రాకమునుపు అంటే జనవరిలోనే వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీ అయిన రామ్ ఆవాస్ రిసార్ట్స్ హోటల్స్ గ్రూప్‌నకు చెందిన ఉదయ్ దినకర్ వద ్దనుంచి 14 ఎకరాలు కొనుగోలు చేశారు. 2015 ఫిబ్రవరిలో జీవో వస్తే, వారు జనవరి 19న కొనుగోలు చేశారు. ఈ ఆస్తులూ అటాచ్‌మెంట్‌లోకి రాలేదు. అంటే విలువైన భూములను అటాచ్‌మెంట్‌లో చూపకుండా ప్రభుత్వ పెద్దలే తీసేసుకుని, నామమాత్రపు విలువున్న వాటిని అటాచ్‌మెంట్‌లో పెట్టారు. ఇందులో కూడా ఉదయ్ దినకర్‌ను అరెస్టు చేయకుండా ప్రభుత్వం కాపాడింది.

 రూ.570 కోట్ల డిపాజిట్లు ఎక్కడికెళ్లాయి?
 ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2015 జనవరి 17న డెక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ... అగ్రిగోల్డ్‌కు సంబంధించి డిపాజిట్లు రూ.500 కోట్లు కమర్షియల్ బ్యాంకుల్లోనూ, రూ.70 కోట్లు నాన్‌కమర్షియల్ బ్యాంకుల్లోనూ  డిపాజిట్లుగా ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత 22 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి, హైకోర్టుకు రూ. 6 లక్షలు మాత్రమే ఉన్నాయని సమర్పించారు. ఆరులక్షలుండడమేమిటని జడ్జి ఆక్షేపించారు. అంటే ఈ డిపాజిట్లు ఎక్కడికెళ్లినట్టు? ఎవరు తీసుకెళ్లినట్టో చెప్పాలి...అని జగన్ నిలదీశారు.
 
 గ్రూప్ కంపెనీలన్నీ అటాచ్‌మెంట్ పరిధిలోకి తేవాలి
 అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలానికి చెందిన కేశవరెడ్డికి సీఐడీ నుంచి ఒక నోటీసు వచ్చింది. ఈ నోటీసులో అగ్రిగోల్డ్ పేరు మాత్రమే ఉంది. కానీ శ్రీయ శాండల్స్ ప్రైవేటు లిమిటెడ్, ఎకో శాండల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పేరుతోనూ డిపాజిట్లు సేకరించారు. కానీ ఆ సంస్థలను ఎక్కడా చూపించలేదు. ఇవికూడా బయటికి చూపిస్తే రూ.6,850 కోట ్లకంటే ఎక్కువే డిపాజిట్లు ఉంటాయి. బాధితుల సంఖ్య మరిన్ని లక్షలు పెరిగే అవకాశం ఉంది. నిజానికి అగ్రిగోల్డ్ సంస్థ ఒక్కటే కాదు.. మరో 155 గ్రూప్ కంపెనీలు ఉన్నాయి. వాటి జోలికి మాత్రం ప్రభుత్వం వెళ్లడం లేదు. అగ్రి సీడ్స్, అగ్రి ఫుడ్స్, అగ్రి మిల్క్ ప్రొడక్ట్స్, అగ్రి ఆర్గానిక్స్, అగ్రి హెల్త్‌కేర్, పవర్, టూరిజం, హోటల్స్, రిసార్ట్స్ వంటివన్నీ ఉన్నాయి. వాటిని కూడా అటాచ్‌మెంట్ పరిధిలోకి తెస్తేనే బాధితులందరికీ న్యాయం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఆ వైపు కన్నెత్తికూడా చూడడం లేదు. తాజాగా అగ్రిగోల్డ్‌కు చెందిన క్లేరియంట్ పవర్‌ప్లాంట్‌ను అమ్మేశారు. ఫొటోలతో సహా బాధితులు కోర్టుకు సమర్పించారు. అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ కొడుకు దుబాయ్‌లో జ్యుయలరీ షాపు నిర్వహిస్తున్నారు.ఇక్కడ చూస్తే నామమాత్రపు అరెస్టులు చేసి చేతులు దులుపుకున్నారు... హైకోర్టు ఆక్షేపిస్తేనే పనిచేస్తున్నారు.
 
 హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఆస్తుల వేలం జరగాలి..
 అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిగా న్యాయం జరగాలంటే సీబీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించాలి. అనంతరం సీబీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆస్తులు వేలంవేయాలి. ఈ ఆస్తుల వేలం ప్రక్రియ హైకోర్టు జడ్జి నేతృత్వంలో జరగాలి. వేలానికొచ్చే వారికి ప్రభుత్వమే నమ్మకం కలిగించాలి. లేదంటే లిటిగేషన్ భూములని, వ్యాజ్యాలున్నవని.. బెదిరిస్తే ఎవరూ వేలానికి రారు. ఈ ఆస్తులు వేలంలో కొంటేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. అందుకే వేలం పాటకొచ్చే వారికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో నమ్మకం కల్పించాలి. ఇలా జరిగినప్పుడే 40 లక్షల మంది బాధితులకు సరైన పద్ధతిలో న్యాయం జరుగుతుంది.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
 
 మీకు న్యాయం జరిగేవరకూ కృషిచేస్తా
  అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ భరోసా
 ‘అగ్రిగోల్డ్’ వల్ల నష్టపోయిన పలువురు బాధితులు సోమవారమిక్కడ అసెంబ్లీ లాబీల్లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు తమ గోడును ఆయన వద్ద వెళ్లబోసుకున్నారు. తొలి నుంచీ కంపెనీ తమను నమ్మించి ఎలా మోసపుచ్చిందీ వారు జగన్‌కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. ప్రతిపక్ష నేత స్పందిస్తూ.. బాధితులకు అండగా ఉంటామని, వారందరికీ న్యాయం జరిగేవరకూ కృషి చేస్తామని భరోసానిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement