అగ్రిగోల్డ్‌పై దద్దరిల్లిన అసెంబ్లీ
వాయిదా తీర్మానంపై చర్చకు విపక్ష వైఎస్సార్‌సీపీ పట్టు
♦ బాధితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు
♦ రెండుసార్లు వాయిదా పడిన సభ
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కుంభకోణంపై సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. బాధితులకు న్యాయం చేయాలన్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నినాదాలతో హోరెత్తింది. పోడియం ఎదుట నిరసనలు, పరస్పర వాగ్వాదాలతో తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. మూడోసారి ప్రారంభమైనా విపక్ష సభ్యులు పట్టువీడలేదు. లక్షలాది మంది డిపాజిటర్లు, వేల కోట్ల రూపాయల నిధులు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశమైనందున ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే చర్చించాలని డిమాండ్ చేసింది. ఎట్టకేలకు మధ్యాహ్న భోజన విరామానంతరం చర్చకు ప్రభుత్వం అంగీకరించడం, స్పీకర్ కూడా ఆ మేరకు విజ్ఞప్తి చేయడంతో.. తాము సహకరిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
సభ ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. తొలిప్రశ్నకు రెవెన్యూ శాఖ మంత్రిని జవాబు చెప్పాల్సిందిగా ఆదేశించారు. ఇంతలో వైఎస్సార్‌సీపీ సభ్యులు అగ్రిగోల్డ్ కుంభకోణంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. 32 లక్షల మంది డిపాజిటర్లకు సంబంధించిన అంశాన్ని తక్షణమే చర్చకు చేపట్టాలని డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ నిరాకరిస్తూప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాత వాయిదా తీర్మానం వ్యవహారాన్ని చూద్దామన్నారు.
ఇందుకు విపక్ష సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. దీనిపై 5 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం ఎదుట నిలబడి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ దశలోనే మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కె.శ్రీనివాసులు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. అచ్చెన్నాయుడు తన సహజ ధోరణిలో... 25 రోజులుగా సభ నడుస్తుంటే ఈ అంశం ఇప్పటివరకు గుర్తుకురాలేదా? అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బోండా సైతం ఏదేదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా విపక్షం యావత్తూ పెద్దపెట్టున నినాదాలు చేసింది. దీంతో స్పీకర్ తొలిసారి ఉదయం 9.11 గంటల ప్రాంతంలో సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు.
బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..
ముప్పావు గంట తర్వాత 9.55 గంటలకు సభ ప్రారంభమైనా విపక్షం తన పట్టువీడలేదు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఉన్న ఆస్తుల్ని పోగొట్టుకుని ఆకలి బాధలు పడుతున్నారని, ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారంటూ దీనిపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేసింది. స్పీకర్ అంగీకరించకపోవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి ‘ఆత్మహత్యల్ని ఆపాలని, బాధితులకు న్యాయం చేయాలి..’ అంటూ నినదించారు.
ఈ సందర్భంగా స్పీకర్‌కు, వారికి వాగ్వాదం జరిగింది. ఈ దశలో మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. స్పీకర్ చెప్పినట్టుగా నడుచుకోవాలని ఒకరు, విపక్ష సభ్యులపై చర్య తీసుకోవాలని మరొకరు బెదిరింపులకు దిగారు. ఈ దశలో మళ్లీ తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడడం తో స్పీకర్ 10.02 గంటలకు సభను రెండో సారి పది నిమిషాలు వాయిదా వేశారు.
చర్చ జరిగి తీరాల్సిందే..
సుమారు గంటా 15 నిమిషాల తర్వాత సభ ప్రారంభమైనా అగ్రిగోల్డ్‌పై తక్షణం చర్చ జరిగి తీరాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ దశలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. గోరంట్ల, బోండా ఉమా, తోట త్రిమూర్తులు, కాల్వ శ్రీనివాసులు మాటల దాడితో ప్రతిపక్షంపై అక్కసు వెళ్లగక్కారు. అయినా వైఎస్సార్‌సీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో ప్రభుత్వం చర్చకు సిద్ధమేనని, అయితే భోజన విరామం తర్వాత చేపట్టాలని స్పీకర్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ విజ్ఞప్తి చేశారు. దీనికి అంగీకరించాలన్న స్పీకర్ విజ్ఞప్తితో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఈ వేళే చర్చకు అంగీకరించినందున తామూ సహకరిస్తామని ప్రకటించారు. దీంతో ఎజెండాలోని తర్వాతి అంశాన్ని స్పీకర్ చర్చకు చేపట్టారు. మధ్యాహ్నం నుంచి అగ్రిగోల్డ్ అంశాన్ని సభలో చ ర్చకు చేపట్టినా.. సాయంత్రం చర్చ ముగియకుండానే సభను అర్ధాంతరంగా వాయిదా వేశారు.