సీసీ కెమెరాల నిఘాలో టెన్త్ పరీక్షలు.. | CCTV cameras to be installed for 10th class exams | Sakshi

సీసీ కెమెరాల నిఘాలో టెన్త్ పరీక్షలు..

Published Thu, Feb 4 2016 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

సీసీ కెమెరాల నిఘాలో టెన్త్ పరీక్షలు..

సీసీ కెమెరాల నిఘాలో టెన్త్ పరీక్షలు..

టెన్త్ పరీక్షల్లో అవకతవకలను నివారించేందుకు పాఠశాల విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది.

  • 15లోగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
  • పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశం
  • అవకతవకల నియంత్రణకు నిర్ణయం
  • వ్యయం సుమారు రూ.40 కోట్లు
  • ఆర్థిక భారమంటున్న   ప్రైవేటు యాజమాన్యాలు
  • వచ్చే ఏడాదికి వాయిదా వేయాలి:‘ట్రస్మా’
  •  
    సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల్లో అవకతవకలను నివారించేందుకు పాఠశాల విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పరీక్షలను నిఘానీడలో జరపాలని నిర్ణయించింది. గతంలో పలు ప్రాంతాల్లో జరిగిన మాస్ కాపీయింగ్, పరీక్ష రాసే విద్యార్థులకు ఇన్విజిలేటర్లే జవాబులు చెప్పడం.. వంటి ఘటనలు వెలుగుచూడటంతో వాటిని అరికట్టేందుకు సిద్ధమైంది. మార్చి 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను వినియోగించాలని తాజాగా నిర్ణయించింది.
     
    రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరగనున్న అన్ని (ప్రభుత్వ, ప్రైవేటు) పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారు (డీఈఓ)లను ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ (డీజీఈ) ఆదేశించారు. దీంతో ఈనెల 15లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పరీక్షాకేంద్రాలుగా ఎంపికైన ప్రభుత్వ పాఠ శాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లకు ఆయా డీఈఓలు ఉత్తర్వులు జారీచేశారు. పరీక్షహాలుగా వినియోగించే తరగతి గదులు, ప్రశ్నాపత్రాల బండిల్స్ తెరిచే, జవాబు పత్రాలు ప్యాక్ చేసే గదులు, ప్రధానోపాధ్యాయుని రూమ్‌తో పాటు పాఠశాల ప్రాంగణమంతా కనిపించేలా ఓపెన్ కారిడార్‌లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
     
    రూ.40 కోట్లకు పైగా వ్యయం
    రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా, 2,528 పరీక్షాకేంద్రాలను ఎంపిక చేశారు. 1,510 ప్రభుత్వ పాఠశాల(జెడ్పీ, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్)ల్లో, 1,018 ప్రైవేటు పాఠశాలల్లో పరీక్షలు జరగనున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటకు ఒక్కో పాఠశాలకు రూ.1.5 లక్షల చొప్పున ఖర్చవుతుందని అంచనా.
     
    దీనిప్రకారం ప్రభుత్వ పాఠశాలకు రూ.22.65 కోట్లు ఖర్చు కానుండగా, పైవేటు పాఠశాలలపై రూ.15.27 కోట్ల భారం పడనుంది. ఇవికాక టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారి కోసం మరో 300 పరీక్షాాకేంద్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం కలిపితే సీసీ కెమెరాలకయ్యే ఖర్చు రూ. 40 కోట్లు దాటనుందని ప్రభుత్వ వర్గాల అంచనా.
     
     ప్రైవేటు స్కూళ్లకు ఆర్థిక భారమే!
     టెన్త్ పరీక్షాకేంద్రాలుగా ఎంపికైన ప్రైవేటు పాఠశాలల్లో సీసీ కెమెరాలను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్న ఆదేశాలు తమకు ఆర్థిక భారంగా పరిణమించాయని ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు వాపోతున్నారు. ఒక్కో పాఠశాలలో కనీసం 15 నుంచి 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందని, రూ.1.5-2 లక్షల వరకు వ్యయమవుతుందని చెబుతున్నారు. సాధారణ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఓ మోస్తరు ఆదాయం వచ్చే పాఠశాలలకు సీసీ కెమెరాల ఏర్పాటు భారమేనని, తప్పనిసరి చేసిన పక్షంలో ఆ భారాన్ని విద్యార్థులపైనే (ఫీజుల పెంపు రూపేణా) వేయాల్సి వస్తుందంటున్నారు.
     
     సర్కారీ బడుల్లో భద్రత ఏదీ?
     రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ కాపలాదారులు లేనందున రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే ప్రభుత్వం అందించిన కంప్యూటర్లు పలు పాఠశాలల్లో చోరికి గురైన సంగతి తెలిసిందే. సీసీ కెమెరాల ఏర్పాటు అలా ఉంచితే.. ఏడాది పొడవునా వాటి నిర్వహణ మరింత ఇబ్బందికరంగా మారనుందని పలువురు ప్రధానోపాధ్యాయులు అంటున్నారు.
     
     వచ్చే ఏడాదికి వాయిదా వే యండి
     పరీక్షాకేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అయితే, ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించడం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఇబ్బందికరమే. ఒకేసారి అన్ని పాఠశాలలు సీసీ కెమెరాల కోసం ఎగబడితే ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం గ్రామీణ పాఠశాలలపై ఎక్కువగా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నందున, ప్రైవేటు స్కూళ్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాల ఏర్పాటును వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని కోరుతున్నాం.
     
     -శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్ర స్మా) అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement