ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు
జీహెచ్‌ఎంసీలో చీఫ్‌మెడికల్ ఆఫీసర్ లేక అవస్థలు
సాక్షి, సిటీబ్యూరో : విదేశాల్లో జరిగే జనన, మరణాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పొందలేక నగరానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరానికి చెందిన వారు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ జననం లేదా మరణం సంభవిస్తేఅందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను స్థానిక జీహెచ్‌ఎంసీ అందజేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలు పరిశీలించి, అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఎక్కడైతే జననం లేదా మరణం జరిగిందో దానిని ధ్రువీకరిస్తూ జీహెచ్‌ఎంసీ ధ్రువపత్రాలు జారీ చేస్తుంది.
అయితే ఇందుకు సంబందించి రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న చీఫ్‌మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) పోస్టు దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉండటంతో సదరు సర్టిఫికెట్లు అవసరమైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటితోపాటు స్థానికంగా జరిగే జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో దొర్లే పొరపాట్ల సవరణ, పిల్లల దత్తత తదితర కార్యక్రమాలకు సైతం ఆయనే ప్రధాన రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తారు. అయితే జీహెచ్‌ఎంసీలో సీఎంఓ గత మేలో రిటైర్‌కావడంతో అప్పటి నుంచి ఇంతవరకు ఎవరినీ నియమించకపోవడంతో సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో ఆర్నెళ్లుగా అడిషనల్ కమిషనర్ సీఎంఓహెచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ సర్కిళ్ల నుంచి వస్తున్న దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిని ఆసరా చేసుకున్న కొందరు అర్హత లేని వారు తమకు ఈ అధికారాన్ని కట్టబెట్టాల్సిందిగా కొంతకాలం క్రితం కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోగా అందుకు అంగీకరించనట్లు సమాచారం. ఇదిలా ఉండగా సంబంధిత అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం-పారిశుధ్యం) ఇన్‌ఛార్జి సీఎంఓహెచ్ విధులు కూడా నిర్వహిస్తున్నప్పటికీ.. రవాణా, ఎంటమాలజీ, వెటర్నరీ, ఘనవ్యర్థాల నిర్వహణ, తదితర విభాగాల అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటమేగాకుండా, సెంట్రల్‌జోన్ కమిషనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
దీంతో సంబంధిత సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీన్ని ఆసరా చేసుకున్న కొందరు దిగువస్థాయి సిబ్బంది సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు, పొరపాట్లను సవరించుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి తావు లేకుండా.. సర్టిఫికెట్లు సత్వరం జారీ చేసేందుకు కమిషనర్ తగుచర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
పుట్టినా.. గిట్టినా తిప్పలే..
Published Sat, Apr 18 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM
Advertisement
Advertisement