ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలేవీ?
తెలంగాణ, ఏపీ స్పీకర్లపై సీఈసీకి చాడ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డా, వారిపై చర్యలు తీసుకోవడంలో ఆయా రాష్ట్రాల స్పీకర్లు విఫలమయ్యారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి... చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సయ్యద్ నసీం అహ్మద్ జైదీ దృష్టికి తీసుకెళ్లారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ప్రకారం ఆ సభ్యులపై అనర్హత వేటు వేయాల్సి ఉండగా, స్పీకర్లు ఆ దిశలో చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారు అధికార పార్టీలవారు కావడమే ఇందుకు కారణమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, ఇటీవల టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్‌పై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ అనైతిక చర్యలపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సీఈసీకి చాడ లేఖ పంపించారు.