
దొంగ సొమ్ముతో.. దొర బతుకు!
విలాస జీవితం కోసం శివ నేరాల బాట
సాక్షి, సిటీబ్యూరో: జల్సాల కోసం జనాలను దోచేశాడు... ఏడు జిల్లాలను వణికించాడు... వందల కేసుల్లో ఇరుక్కున్నాడు.. ఎనిమిదిసార్లు జైలుకెళ్లాడు... అయినా బుద్ధి మారలేదు.. దొంగసొమ్ముతో దొరలా బతకడానికి అలవాటుపడ్డాడు... దోపిడీ సొమ్ము కోసం ఎంతకైనా తెగించాడు... చివరకు పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ ఔటర్ రింగురోడ్డులో చనిపోయిన చైన్‌స్నాచర్ శివ నేరచరిత్ర ఇది..
2002 నుంచే నేరాలబాట...
నెల్లూరు జిల్లాకు చెందిన శివకుమార్ తన ఊరుకే చెందిన నారాయణతో కలిసి 2002లో నేరజీవితాన్ని ప్రారంభించాడు. వీరిద్దరు తిరుపతి, నెల్లూరులోని పలు హాస్టళ్లలలో ఉంటూ సెల్‌ఫోన్‌లు, లాప్‌టాప్‌లు, పర్సులు దొంగిలించారు. చివరికి తిరుపతి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. విడుదలైన తర్వాత నారాయణ సోదరుడు మండపాటి జగదీష్‌తో కలిసి 2004లో హైదరాబాద్ చేరుకుని యూసుఫ్‌గూడ, ఇందిరానగర్, కృష్ణానగర్‌లలో హాస్టల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ జూబ్లీహీల్స్ పోలీసులకు చిక్కాడు. తర్వాత చంచల్‌గూడ జైల్లో శిక్ష అనుభవించి 2005లో విడుదలయ్యాడు. కృష్ణానగర్‌కు చెందిన నాగమణిని ప్రేమవివాహం చేసుకొని తన మకాంను రాజమండ్రికి మార్చాడు. అక్కడ కూడా నారాయణతో కలిసి నేరాలు చేయసాగాడు. ఈ క్రమంలోనే 2006లో నారాయణ మిర్యాలగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ తరువాత తన మకాంను హైదరాబాద్‌కు మార్చిన శివ... జగదీష్‌తో కలిసి మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్‌లలో 42 లాప్‌టాప్‌లు చోరీ చేసి మాదాపూర్ పోలీసులకు చిక్కి చర్లపల్లి జైలుకెళ్లాడు. జైలులో వీరిద్దరికి పాత నేరస్తులు ఎమ్.రాజు, డి.మారుతి పరిచయం అయ్యారు. వారితో కలిసి తరువాత స్నాచింగ్‌లకు శ్రీకారం చుట్టారు. 2009లో స్నాచింగ్‌కు పాల్పడుతూ నెల్లూరు, విజయవాడ, తిరుపతి, వైజాగ్ పోలీసులకు పట్టుబడి 2010లో జైలు కెళ్లారు. అక్కడి నుంచి విడుదలై చందానగర్, కూకట్‌పల్లి, కుషాయిగూడ, మల్కాజ్‌గిరి పరిధిలో దోపిడీలు చేస్తూ కేపీహెచ్‌బీ పోలీసులకు పట్టుబడి జైలు కెళ్లాడు. విడుదలైన తరువాత మరో స్నాచర్ రాజ్‌కుమార్ వీరికి జతకలిశాడు. ఈ ముగ్గురు హైదరాబాద్, సైబరాబాద్, మెదక్ జిల్లాల్లో రెండేళ్లలో 300కుపైగా స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేశారు.
ఏడు జిల్లాల పోలీసుల గాలింపు..
శివ తన అనుచరులతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏడు జిల్లాలలో వందలాది చోరీలకు పాల్పడ్డాడు.ఎనిమిది సార్లు జైలుకు వెళ్లాడు. ఇతడి గ్యాంగ్‌పై 300లకుపైగా స్నాచింగ్ కేసులున్నాయి. శివ కోసం రెండేళ్ల నుంచి తిరుపతి, వైజాగ్, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, సైబరాబాద్, మెదక్ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. చివరకు శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్‌లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపై కత్తితో దాడి చేసి పారిపోతుండగా సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. ఇతని ఇద్దరు అనుచరులు జగదీష్(వైజాగ్), రాజ్‌కుమార్(నెల్లూరు)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జల్సా జీవితం...:నార్సింగ్‌లోని శివ ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతడి లగ్జరీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతడి ఇంటి వద్ద రెండు లగ్జరీ కార్లు, స్కూటీతో పాటు ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్ ్సలో రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కుదువపెట్టిన రసీదులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తుతో గోవా, ఊటీ, కొడెకైనాల్‌లలో జల్సా చేసినట్లు తెలిసింది.
90 శాతం స్నాచింగ్‌లు
శివ సుమారు 400కుపైగా నేరాలకు పాల్పడ్డాడు. అతడి భార్య నాగలక్ష్మితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నాం. వారిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. సైబరాబాద్‌లో 2013లో 1,024 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో 55 శాతం కేసులు ఛేదించాం. 2014లో ఇప్పటి వరకు 600 వరకు చైన్‌స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 50 శాతం కేసుల్లో నేరస్తులను గుర్తించాం. మిగలిన స్నాచింగ్‌కేసుల్లో 90 శాతం శివ గ్యాంగ్ ప్రమేయం ఉంది.
- సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్