
నఘోరం
అడుగు బయట పెట్టాలంటే భయం.. కాస్త ఆదమరిస్తే చాలు నగానట్రా మాయం.. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లారంటే గొలుసుదొంగల చేతివాటం..
వరుస నేరాలతో భీతిల్లుతున్న నగరం
పోలీస్‌లకు సవాల్ విసురుతున్న నేరగాళ్లు
మొన్న ఫాంహౌస్‌లో.. నిన్న మేడిపల్లిలో అకృత్యాలు
చైన్‌స్నాచింగ్‌లు, దోపిడీలు, హత్యలు నిత్యకృత్యం
{పేక్షక పాత్రలో పోలీస్ యంత్రాంగం
అడుగు బయట పెట్టాలంటే భయం.. కాస్త ఆదమరిస్తే చాలు నగానట్రా మాయం.. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లారంటే గొలుసుదొంగల చేతివాటం.. మోసాలు, మాయాజాలాలకు లెక్కేలేదు. ఇక భయపెట్టి, బెదిరించి అకృత్యాలు సరేసరి. ఎక్కడా నిర్భయంగా ఉండే పరిస్థితి లేదు. బరితెగించి రెచ్చిపోతున్న నేరగాళ్ల ధాటికి నగరం భీతిల్లుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్.. ఘటన జరిగిన చోటకు క్షణాల్లో వాలిపోయేలా అధునాతన హంగులు.. నగరం ఒళ్లంతా నిఘా కెమెరాల కళ్లు.. నేరగాళ్ల అకృత్యాలకు చెల్లు అంటూ చెబుతున్న యంత్రాంగానికి ఈ నేరాలు.. ఘోరాలు సవాల్ విసురుతున్నాయి.
బరితెగిస్తున్న నేరగాళ్లు
కొద్ది రోజులుగా గ్రేటర్ నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజధానిలో భద్రత డొల్ల అని నిరూపిస్తున్నాయి. శామీర్‌పేట శివారులో దొంగనోట్ల ముఠా ఏకంగా పోలీసులపైకే తెగబడిన వైనం శాంతిభద్రతల్ని ప్రశ్నార్థకం చేసింది. దీని తరువాత శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై కరడుగట్టిన చైన్‌స్నాచర్ శివ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఈ ఘటన అనంతరం దాదాపు 50 మంది గొలుసుదొంగలపై నిఘా ఉంచామని, అందరి ఆటా కట్టిస్తామని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. కానీ, నేటికీ నగరంలో గొలుసు దొంగతనాలు ఆగలేదు. వనస్థలిపురంలో దుండగులు సోమవారం ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుపోయారు. మరో మహిళ మంగళసూత్రాన్ని తెంచుకుపోవడానికి విఫలయత్నం చేశారు. మొన్నటికి మొన్న సొంత ఫామ్‌హౌస్‌లోనే స్నేక్‌గ్యాంగ్ చేతిలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది.
ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి నిందితుల కొమ్ము కాశారన్నది తాజాగా వెల్లడైన నిజం. దీన్ని మరవక ముందే మేడిపల్లిలో ఓ గిరిజన మహిళపై ఐదుగురు కీచకులు అకృత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇక, శనివారం వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలు బెంబేలెత్తించాయి. పట్టపగలే కోఠి ప్రాంతంలో దుండగులు కత్తులతో దాడిచేసి రూ.40 లక్షలు దోచుకుపోయారు. కాచిగూడ బిగ్‌బజార్‌లో రూ.35 లక్షల విలువైన సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మూటగట్టుకుపోయారు. వ్యవస్థీకృత నేరాలు ఇలా ఉంటే, ఇక క్షణికావేశంలో తనువు చాలిస్తున్న, ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు కలచివేస్తున్నాయి.