సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. కర్ణాటకలోని బెంగళూరులో వరుసపెట్టి పంజా విసారాడు.. హైదరాబాద్‌కు చేరుకుని రెండు రోజుల్లో అయిదు చైన్ స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేశాడు.. చూడటానికి పక్కా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలా కనిపించే ఈ ఘరానా నేరగాడు ఉమేష్ ఖతిక్‌ను అప్పగించేది లేదని అహ్మదాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో శనివారం తెల్లవారుజామున ఆ అధికారులు అక్కడే పట్టుకున్నారు. అతడిని తమకు అప్పగించాలంటూ ఇక్కడి పోలీసులు వెళ్లి కోరగా... తామే అరెస్టు చేస్తామని ఆపై పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లండి అంటూ స్పష్టం చేశారు. దీంతో ఆదివారం రాత్రి తెలంగాణ పోలీసు బృందాలు తిరిగి పయనమయ్యాయి.
నాలుగు గంటలకు పైగా నడక..
మంగళవారం మధ్యాహ్నం రైలులో నగరానికి చేరుకున్న ఉమేష్ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని మెజిస్టక్ హోటల్‌లోని రూమ్ నెం.204లో బస చేశాడు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అతగాడు బయటకు వచ్చి కాలినడకన బయలుదేరాడు. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో కాలినడకన సంచరించిన ఉమేష్ సాయంత్రం 5,30 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం చేరుకున్నాడు. అక్కడి జిర్రా రోడ్‌లో మహ్మద్ సులేమాన్ నిర్వహిస్తున్న మొబైల్ దుకాణం వద్దకు వెళ్లాడు. అప్పటికి కొద్దిసేపటి ముందే తన యాక్టివా వాహనంపై సరుకు తీసుకువచ్చిన సులేమాన్ తన వాహనాన్ని దుకాణం ముందు పార్క్ చేశారు. అప్పటికే కస్టమర్లు ఎదురు చూస్తుండటంతో ఆ హడావుడిలో బండికి తాళం వేయడం మర్చిపోయిన ఆయన సరుకు తీసుకుని షాపు లోపలకు వెళ్లిపోయారు.
చదవండి: Chain Snatcher: చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్.. ఎంత దూరమైనా సరే..
అల్పాహారం తర్వాత మొదలుపెట్టి..
తాళంతో సహా ఉన్న సులేమాన్ ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన ఉమేష్ దాన్ని తస్కరించాడు. అక్కడ నుంచి చెక్కర్లు కొడుతూ తాను ఉన్న హోటల్‌కు చేరుకున్నాడు. ఆ రాత్రి హోటల్‌లోనే ఉన్న ఉమేష్ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అల్పాహారం చేసి అక్కడ నుంచి బయలుదేరాడు. ఎక్కడా ఎలాంటి రెక్కీలు చే యని అతగాడు నేరుగా అల్వాల్‌కు చేరుకున్నా డు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి మొదలెట్టి మేడిపల్లిలో సాయంత్రం 4.30 వరకు వరుసపెట్టి నేరాలు చేశాడు. అక్కడి సంపూర్ణ హోట ల్ వద్ద వాహనం, సమీపంలోని చెంగిచర్ల చౌర స్తా సమీపంలో ఉన్న మేకల బాల్‌రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద తన జర్కిన్ విడిచిపెట్టాడు. అక్కడ నుంచి బస్సులో లక్డీకాపూల్‌కు చేరుకున్న ఉమేష్... ఆటోలో హోటల్‌కు చేరాడు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హోటల్ ఖాళీ చేసి రైలులోనే అహ్మదాబాద్ చేరుకున్నాడు.
హోటల్‌లో మరో వ్యక్తి ఫోన్ నంబర్...
ఉమేష్ నాంపల్లిలోని మెజిస్టిక్ హోటల్‌లో బస చేస్తున్న సమయంలో తన ఫోన్ నంబర్ పొందుపరచలేదు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన చేతన్ రాథోడ్‌కు చెందిన నంబరును ఇచ్చాడు. గుర్తింపు కార్డుగా మాత్రం తన ఆధార్‌నే అందించాడు. సీసీ కెమెరాల ఆధారంగా ఉమేష్ కదలికలు తెలుసుకున్న పోలీసులు హోటల్ వరకు వచ్చాడు. రిజిస్టర్‌లో ఉన్న ఫోన్ నంబర్‌కు సంప్రదించగా ఉమేష్ ఎవరో తనకు తెలియదని చేతన్ చెప్పాడు. దీంతో ఆధార్ కార్డు ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు ఉమేష్ నేరచరిత్ర తెలుసుకున్నారు. సాంకేతిక ఆధారాలను బట్టి అతడు శుక్రవారం రాత్రి అతడు అహ్మదాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి బృందాలు వెళ్లేసరికి అతడు తప్పుకునే అవకాశం ఉందని భావించిన అధికారులు అహ్మదాబాద్ అధికారులను అప్రమత్తం చేశారు. శనివారం తెల్లవారుజామున ఆ ఇంటిపై దాడి చేసిన ఆ పోలీసులు ఉమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి దాదాపు 20 రోజులుగా బెంగళూరు అధికారులు అహ్మదాబాద్ పోలీసులతో టచ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment