త్వరలో లక్షమంది నిరుద్యోగులతో ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొత్త బంగళాలు నిర్మించుకోవడం కాకుండా ముందు ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. అశోక్‌నగర్ నగర కేంద్ర గ్రంథాలయంలో తెలంగాణ నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నిరుద్యోగ బహిరంగ సభలో కృష్ణయ్య పాల్గొన్నారు.
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి, అధికారం చేపట్టి 21నెలలు గడచినా హామీల జాడ లేదన్నారు. 43వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్‌లు, పారిశ్రామిక వేత్తలకు లబ్థి చేకూర్చే వాటర్‌గ్రిడ్ పథకానికి రూ.42వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్‌ను దారాధత్తం చేశారని మండిపడ్డారు. 14లక్షల విద్యార్థుల ఫీజులు, స్కాలర్ షిప్పులకు రూ.1,600 కోట్లు బడ్జెట్ లేదంటున్నారని... కానీ, ముగ్గురు కాంట్రాక్టర్‌లకు రూ.42వేల కోట్లు ఎలా ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.