
ధూల్‌పేటకు చవితి కళ
- ఊపందుకున్న వినాయక
- విగ్రహాల విక్రయాలు
- ఈసారి షోలాపూర్ నుంచి దిగుమతి
- స్వల్పంగా పెరిగిన ధరలు
జియాగూడ: వినాయక చవితి దగ్గర పడుతుండడంతో నగరంలో వినాయక విగ్రహాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ధూల్‌పేటలో తయారయ్యే విగ్రహాలను రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు తరలిస్తుంటారు. గత వారం రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. నగరంలోనే గాక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మండపాల నిర్వాహకులు ధూల్‌పేట నుంచే విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో ధూల్‌పేట రహదారులు కొనుగోలుదారులతో రద్దీగా మారుతున్నాయి. ఇళ్లలో మహిళలు తయారు చేస్తున్న గణనాథులు సైతం పండుగ రెండు రోజుల ముందుగానే పలు కూడళ్లలో అమ్మకానికి ఉంచారు.
పెద్ద విగ్రహాలను ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. తయారీ దారులు విగ్రహాలను గాంధీపుత్ల నుంచి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ వరకు, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్, ఉస్మానియా వెనుక వైపు, ముస్లింజంగ్ పూల్, సీతారాంబాగ్, అప్పర్ ధూల్‌పేట, గంగాబౌలి తదితర ప్రధాన రహదారులకు ఇరుపక్కలా విక్రయాలకు ఉంచారు. ఈ ఏడాది గతం క ంటే అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
అగ్రస్థానం ధూల్‌పేటదే..
ప్రస్తుతం నగరంలో పలు చోట్ల గణనాథుల విగ్రహాలు తయారు చేస్తున్నా ఎక్కువ శాతం ధూల్‌పేటలోనే తయారవడం విశేషం. క్కడ కళాకారుల చేతిలో ప్రాణం పోసుకున్న విగ్రహాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తరలిస్తుంటారు. అంతే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం ప్రాంతాలకు సైతం ఇక్కడి నుంచే తరలించడం విశేషం.
బహు రూపాల్లో లభ్యం..
ఇక్కడి కళాకారులు విఘ్నేశ్వరుడిని ఎన్నో రూపాల్లో తీర్చి దిద్దుతున్నారు. ముఖ్యంగా దత్తాత్రేయ, శివపార్వతుల మధ్య విఘ్నేశ్వరుడు, హరిహరుడు, సాగర మథనం, డ్రాగన్ చైనా గణేష్, గంగా జమున, ప్రపంచ పటంలో విఘ్నేశ్వరుడు తదితర ఎన్నో రూపాల్లో విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఇతర ప్రాంతాల్లో విక్రయించే విగ్రహాల ధరలతో పోలిస్తే ధూల్‌పేట విగ్ర హాలు తక్కువకే లభిస్తాయి. అయితే, గతేడాది కంటే ఈసారి విగ్రహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. విగ్రహాన్ని బట్టి రూ.500 నుంచి 1.50 లక్షల వరకు ఉన్నాయి. ముడి సరుల ధరలు పెరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తయారీ దారులు చెబుతున్నారు.
షోలాపూర్ విగ్రహాల దిగుమతి..
అన్ని ప్రాంతాలకు వినాయక విగ్రహాలను ధూల్‌పేటలో తయారు చేసి ఎగుమతి చేస్తుంటే ఈసారి షోలాపూర్ నుంచి ఇళ్లలో నెలకొల్పే గణనాథులు దిగుమతి అవుతున్నాయి. ఈ విగ్రహాల తయారీలో ప్లాస్టర్, మట్టితో చేయడంతో పాటు రంగులతో సుందరంగా తీర్చి దిద్దుతుండడంతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. వీటి ధరలు రూ.20 నుంచి రూ.800 వరకు ఉన్నాయి.