
అక్కినేని అఖిల్ పేరుతో మోసం చేస్తున్న అభినవ్
అక్కినేని అఖిల్ పేరుతో సోషల్ మీడియా ద్వారా డబ్బు వసూలు చేస్తున్న ఓ యువకుడ్ని కూకట్‌పల్లిలో ఒక యువతి ఇరగదీసింది.
హైదరాబాద్: అక్కినేని అఖిల్ పేరుతో సోషల్ మీడియా ద్వారా డబ్బు వసూలు చేస్తున్న ఓ యువకుడ్ని కూకట్‌పల్లిలో ఒక యువతి ఇరగదీసింది. ఆ యువతి చెప్పిన కథనం ప్రకారం అభినవ్ అనే యువకుడు అఖిల్ పేరుతో ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలు తెరిచి యువతుల వద్ద డబ్బు వసూలు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున, అమల,అఖిల్ ఫొటోలను పోస్ట్ చేశాడు. అఖిల్ మాదిరిగా చాటింగ్ చేశాడు.
అభినవ్ డబ్బు ప్రస్తావన తీసుకురావడంతో ఆ యువతి అనుమానించింది. ఈ విషయం తన అన్నయ్యకు చెప్పింది. ఈ విధంగా ఇతరులు మోసపోకూడదన్న సదభిప్రాయంతో ట్రాప్ చేసి అభినవ్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ యువతి వాడి చెంప చెళ్లు మనిపించి, చితకబాదింది. ఆ తరువాత ఆ మోసగాడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అభినవ్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.