తల్లి కోసం తల్లడిల్లుతున్న బాలుడు
హైదరాబాద్ : మూడు రోజుల క్రితం బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అదృశ్యమైన కె. జ్యోతి(24) అనే యువతి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా అవిడికొత్తపేటకు చెందిన వెంకన్నబాబు, కె.జ్యోతి దంపతులు తమ ఏడాదిన్నర కుమారుడికి చికిత్స నిమిత్తం ఈ నెల 15న రెయిన్‌బో ఆస్పత్రికి వచ్చారు. బాలుడికి స్కానింగ్ చేయాలని వైద్యులు చెప్పడంతో వారు కొడుకును తీసుకొని సమీపంలోని ఓ స్కానింగ్ సెంటర్‌కు వచ్చాడు. కొడుకుతో పాటు వెంకన్న స్కానింగ్ ల్యాబ్‌లోకి వెళ్లగా జ్యోతి ఆస్పత్రి ఆవరణలో కూర్చుంది. మధ్యాహ్నం బయటకు వచ్చిన వెంకన్నకు తన భార్య కనిపించకపోగా ఆమె హ్యాండ్ బ్యాగ్ ఫోన్ అక్కడ పడి ఉండడంతో ఆందోళనకు గురై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు జ్యోతి ఫోన్ కాల్ డేటాను సేకరించారు. అదృశ్యమయ్యే ముందు ఆమె రమేష్ అనే యువకుడితో మాట్లాడినట్లు తేలింది. దీంతో పోలీసులు రమేష్ ఫోన్‌పై నిఘా ఉంచగా, అతను నెల్లూరులో ఉన్నట్లు తేలడంతో ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపారు. ఇదిలా ఉండగా మూడు రోజులుగా తల్లి లేకపోవడంతో బాలుడు పాల కోసం తల్లడిల్లుతున్నాడు.