
‘సినిమా’ భోజనం
* సందడిగా ఫిలింనగర్ వాసుల కార్తీక వనభోజనాలు
* ఆటాపాటలతో ఆనందంగా..
బంజారాహిల్స్: అరటాకులో భోజనం.. కమ్మని సువాసనల నెయ్యి.. నోరూరించే బొబ్బట్లు.. రోటీచట్ని.. పచ్చిపులుసు.. ముద్దపప్పు.. గుత్తి వంకాయ కూర..కరకరలాడే మినప గారెలు.. పాయసం.. అరిసెలు..సకినాలు... చెగోడీలు.. ఇలా నోరూరించే వంటకాలు ఎన్నో.. అవునుమరి వారంతా సినీ కుటుంబాలకు చెందినవారు. అందులోనూ ఫిలింనగర్ కాలనీలోని సంప్రదాయ కుటుంబాలన్నీ కలిసి ఒక్కచోట చేరినవాయె.. ఇంకేముంది సంప్రదాయ వంటకాల ఘుమఘుమల మధ్య ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సభ్యుల కార్తీక వనభోజనాలు కనుల పండువగా జరిగాయి. వందలాది సంఖ్యలో సినీ కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశాయి.
వయస్సుతో నిమిత్తం లేకుండా, చిన్నపెద్దా అంతా కలిసి ఆటాపాటలతో అదరగొట్టారు. ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యుల వన భోజనం కార్యక్రమం కార్తీక సోమవారం సందర్భంగా కేఎల్‌ఎన్‌రాజుతోటలో ఘనంగా నిర్వహించారు. పిల్లలకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఆటలు, పాటలతో పిల్లలు ఎంతో ఉత్సాహంగా గడిపారు. వీరికి ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌రామారావు, ఉపాధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరాజు, సభ్యులు కాజా సూర్యనారాయణ, భాస్కర్‌నాయుడు, తుమ్మల రంగారావు, పరుచూరి సుష్మ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.
మహిళలకు మ్యూజికల్ చైర్ తదితర ఆటల పోటీలు నిర్వహించగా.. నవ్వులు, కేరింతల మధ్య సరదాగా సాగాయి. మహిళలకు క్యాట్‌వాక్ కూడా నిర్వహించారు. సరదాగా ముచ్చటించుకుంటూ మహిళలు గడపగా పెద్దలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వ్యాపారాలు, సినిమా షూటింగ్‌లు తదితర అంశాలపై చర్చించుకున్నారు. ఉదయం అల్పాహారంతో మొదలైన వనభోజన సందడి సాయంత్రం చీకటి పడే వరకు కొనసాగింది.
ఆటాపాటలతో..
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సభ్యుల కుటుంబాలు ఒక్కచోట చేరి వనభోజన సందడి చేశారు. ఇక్కడ నోరూరించే వంటకాలే కాదు కనువిందు చేసే కార్యక్రమాలు కూడా ఈ వనభోజనాలకు అదనపు ఆకర్షనగా నిలిచాయి. నాలుగైదు గంటల పాటు సందడే సందడి. పసందైన విందుభోజనం, సరదా ఆటాపాటలు ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చాయి.
- కేఎస్ రామారావు, ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు
ఉల్లాసంగా..
అరమరికలు లేకుండా ఒకరికొకరు అన్నట్లుగా మా వనభోజన కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా సాగింది. ఇక్కడ వంటకాలు హైలెట్‌గా నిలిచాయి. ప్రతి ఏటా మా కుటుంబాలన్ని కార్తీక వనభోజనాలకు వెళ్లడం అనవాయితీగా వస్తున్నది. ఈ సారి మరింత సందడిగా నిలిచింది. ఆటపాటాలతో అంతా అదరగొట్టారు.
- కాజా సూర్యనారాయణ, ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యుడు
మరిచిపోలేని అనుభూతి..
ఆడి, పాడి విజేతలుగా నిలిచిన వారికి చక్కని బహుమతులు అందించడం జరిగింది. చిన్నా, పెద్దా అంతా ఆటల్లో పాల్గొని పోటీ పడ్డాం. ఈ సారి వనభోజనాలు హైలెట్‌గా నిలిచాయి. ఒకవైపు నోరూరించే సంప్రదాయ వంటకాలు మరోవైపు ఆటపాటలతో మరిచిపోలేని అనుభూతిని కలిగించింది. మాలోని ఐక్యతను మరోసారి చాటుకున్నాం.
- పరుచూరి సుష్మ, ఫిలింనగర్