హైదరాబాద్: పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు బుధవారం వేకువజామున నగరంలోని పాతబస్తీలో పోలీసులు చబుత్రా మిషన్ ఆపరేషన్‌ను చేపట్టారు. శాలిబండ, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట పరిధిలో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 60 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాలిబండలో 30 మంది, చంద్రాయణగుట్టలో 22 మంది, ఫలక్‌నుమాలో 8 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. వేకువజామున ఒంటి గంట నుంచి 3 గంటల వరకూ ఈ తనిఖీలు నిర‍్వహించారు.
యువతుల్ని వెంబడించడం.. దాడులు చేయడం.. మద్యం తాగి అల్లరి చేయడం, కొట్లాటలకు దిగడం వంటి సంఘటనలు జరుగుతుండటంతో.. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు బృందాలు పాతబస్తీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తెల్లవారితే పరీక్ష ఉన్నప్పటికీ.. కొందరు విద్యార్థులు బైకులపై తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులను వెంటనే విడిచిపెట్టారు. పనీపాట లేకుండా తిరిగే యువకుల బైకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే పరీక్ష అయ్యాక... పట్టుబడ్డ 60 మంది కుర్రాళ్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఫలక్ నుమా మొగల్ ఫంక్షన్ హాల్లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇవాళ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో..
నగరంలోని తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు బుధవారం తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు చేపట్టారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్డగుట్టలో సరైన పత్రాలు లేని 4 ఆటోలు, 26 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా అడ్డగుట్టలో డీసీపీ సుమతి కేక్ కట్ చేశారు. మహిళా దినోత్సవం స్థానిక మహిళలతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని డీసీపీ సుమతి చెప్పారు.
తెల్లవారితే పరీక్ష.. పోలీసులకు దొరికారు
Published Wed, Mar 8 2017 10:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement