సినీ భస్మాసుర..
సిటీలో తెలుగు నాటక ప్రదర్శన
పాత్రధారులుగా పలువురు సినీ నటులు
బెంగాళీ, తమిళ్, మరాఠి భాషల్లో ఊపు మీదున్న నాటకం తెలుగులో మాత్రం చతికిల పడిందేం? హైదరాబాద్‌లో అన్య భాషల నాటకాలు ప్రదర్శిస్తే టిక్కెట్టు కొని మరీ చూస్తారు..మరి తెలుగు నాటకాన్ని ఎందుకు ఆదరించరు? ఈ ప్రశ్నలు రంగస్థల అభిమానుల మదిలో ఎప్పటి నుంచో ఉన్నవే. అప్పుడప్పుడు మాత్రం వారిలో కొందరు దీనికి సమాధానం చెప్పాలనే బాధ్యతను తీసుకుంటారు. ఈ సారి ఆ బాధ్యతను తీసుకున్నారు సీమా అజారుద్దీన్. నగరంలోని రవీంద్రభారతిలో ‘సినీ భస్మాసుర’ నాటకాన్ని ఈ నెల 21, 22 తేదీల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు నాటకం స్థితిగతులపై పలువురి అభిప్రాయాలు, అనుభవాలు...మీకోసం
- సాక్షి, వీకెండ్ ప్రతినిధి
అమెరికా నుంచి 32 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన కర్తాల్ ప్రొడక్షన్స్ అధినేత్రి సీమా అజారుద్దీన్ తెలుగు నాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు రావాలని ఎంతో తపన పడుతున్నారు. అదే లక్ష్యంతో ఆమె టాలీవుడ్ గ్లామర్‌ని, ఇటు థియేటర్ నటీనటులను కలిపి ‘సినీ భస్మాసుర’ నాటక ప్రదర్శనకు సంకల్పించారు. మొత్తం 10 మంది టాలీవుడ్ నటులు, 15 మంది థియేటర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ప్రపంచంలోని 12 కోట్ల మంది తెలుగు వారికి తెలుగు నాటకాన్ని దగ్గర చెయ్యాలని, ఇక్కడ ఉన్న చిన్నా పెద్దా నాటక గ్రూప్‌లు అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఒక రంగస్థల అనుబంధ వేదిక ఏర్పాటు చేయాలనుకుంటున్నారు సీమ. కళలు వినోదాన్ని మాత్రమే కాదు వికాసాన్ని, జ్ఞానాన్ని ఇస్తాయని చెప్పే సీమా...ప్రయత్నానికి తెలాంగాణ ప్రభుత్వం సానుకులంగా స్పందించి సహకారాన్ని అందిస్తోంది. మరోవైపు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నటీనటులు ఈ నాటకానికి గ్లామర్ జోడిస్తున్నారు. గత 40 రోజులుగా ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్స్ హాల్‌లో జరుగుతున్న రిహార్సల్స్‌లో నటీనటులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కలిసిన కళామతల్లి ముద్దు బిడ్డలతో ముచ్చటించినప్పటి విశేషాలివీ...
ఇగోలను తుడిచేస్తుంది...
యాక్టర్ అంటే ఇగో ఉంటుంది. సినిమాలో ఇది మరి ఎక్కువ. కానీ వాళ్లు థియేటర్‌కి వచ్చే సరికి చాలా హంబుల్‌గా మారిపోతారు. అది థియేటర్ గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్ట్ క్యారెక్టర్ పూర్తిగా ఆర్టిస్ట్ సొంతం. కెమెరా లేదు, డబ్బింగ్ లేదు. డూప్ ఉండరు. అందుకే నటుడు తనలో ఉన్న బెస్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతాడు. సింగిల్ టేక్‌లో తన టాలెంట్ ప్రదర్శించడానికి అన్నీ నేర్చుకుంటాడు. - సీమా అజారుద్దీన్
నటన అంటే సినిమా ఒక్కటే కాదు...
యాక్టింగ్ అంటే సినిమా అనే పరిస్థితి మారాలి. నటనకు అవకాశం ఇచ్చే వేదికలు పెరగాలి. అవి సిద్ధం చేయడానికి ఇది ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం. వేరే రాష్ట్రంవాళ్లు వచ్చి చేసిన నాటకానికి పోస్టర్స్, హోర్టింగ్స్, మీడియాలో పూర్తి కవరేజ్. కానీ ఇక్కడి నాటకాలు ఏదో గుట్టుగా అయిపోయితాయి అంతే.. మన తెలుగు నాటకాలకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎందుకు అని అందరూ అలోచించాలి. అప్పుడే నాటకాన్ని నిలబెట్టడానికి మరి కొంత మంది ఆలోచిస్తారు. -రమాదేవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
పాత కథకు కొత్త హంగులు...
ఇది 18 ఏళ్ల క్రితం వేసిన నాటకం. దీన్ని మళ్లీ ప్రదర్శిస్తున్నాం. సుమ మినహా మిగతా వాళ్లంతా ఈ నాటకంలో కొత్త వాళ్లే. అప్పటి కథలో సెల్‌ఫోన్లు, మీడియా హడావుడిలేదు. వాటిని దీంట్లో చేర్చాం. ఈ సబ్జెక్టు కాంటెంపరరీ. రెండు గంటలపాటు ఉండే నాటకం ఇది. దీనిలో కోట శంకర్ రావ్, బాబూమోహన్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, సుమ, శివాజీరాజా, రవి వర్మ, రాళ్లపల్లి, ఢిల్లీ రాజేశ్వరి, వైజాగ్ ప్రసాద్, నంద కుమార్ ఇలా తెలిసిన నటులతో పాటు థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు.
- ఉదయభాను గరికపాటి, నాటక దర్శకులు
ఆ థ్రిల్ వేరు...
గత కొంతకాలంగా సినిమాలు, సీరియల్స్ చేయడం తగ్గింది. నేను నా లాగే,..అంటే సుమ లాగే స్క్రీన్ మీద యాంకరింగ్ చేస్తున్నాను. యూంకరింగ్‌లో డైలాగ్, క్యారెక్టర్‌లు ఉండవు. అందుకే నాటకంలో క్యారెక్టర్ చేస్తావా అంటే వెంటనే ఒప్పుకున్నాను. ఉదయభాను గారి దర్శకత్వంలో అనురాధ పాత్ర 18 ఏళ్ల తర్వాత చేస్తున్నాను. లైవ్ పర్‌ఫార్మన్స్‌లో థ్రిల్ వేరుగా ఉంటుంది. ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అయినా స్పందించకుండా మా పాత్రలో మేం లీనమయి నటించడం నాటకంలో స్పెషల్.
- సుమ. యాంకర్
వాచీలు తాకట్టు పెట్టి నాటకాలు వేశాం
నాటకం చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. అయితే చేసేవాళ్లేరి? ఎందుకంటే...నాటకంలో వేషం వేసినా, రాసినా ఏం రాదు. సీరియల్స్‌కి, సినిమాలకు రాస్తే ఆదాయం వస్తుంది. అప్పట్లో మేం వాచీలు, ఉంగరాలు, సైకిల్లు తాకట్టు పెట్టి నాటకాలు వేశాం. ముందు మంచి నాటకం చూడటం జనానికి అలావాటు చేస్తే, తర్వాత టిక్కెట్టు ఖర్చు పెట్టడానికి ప్రేక్షకులు సిద్ధమని ఇతర భాషల నాటక ప్రదర్శనలు చూస్తే తెలుస్తుంది.
- తనికెళ్ల భరణి, నటుడు, రచయిత