కళా రూపాలు
హ్యూమర్ ప్లస్
నాటకాలకు ముగింపు ఉండదు. ఒకచోట తెరపడితే ఇంకోచోట లేస్తూ ఉంటుంది. పాత నాటకాలే తమిళనాడులో మళ్లీ వేశారు. పాత్రలు మారాయంతే. అమ్మ ఎలా చనిపోయిందో ఎవరూ చెప్పరు కానీ, ఒకాయన కళ్లు మూసుకుని అమ్మ ఆత్మతో మాట్లాడతాడు! ఒకావిడ సమాధిపై పిడిగుద్దులు గుద్ది మరీ అమ్మ ఆత్మను తట్టి లేపుతుంది. ఇకపై నాటకం చెన్నైలో, బెంగళూరు జైలు నుంచి ప్రాంప్టింగ్. జైల్లో పుట్టడం వల్లే శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు జైళ్లు అధోగతిలోనే ఉండడం వల్ల అక్కడికెళితే చాలు.. తత్వం, వేదాంతం అన్నీ ఒంటపడతాయి. జైళ్ల సంస్కరణలు అని పుస్తకాలు రాస్తూ ఉంటారు కానీ సంస్కారం, జైలు.. ఇవి రెండూ వేర్వేరు విషయాలు.
ఇళ్లకు రంగులు కొట్టడం ఆ మధ్యనొచ్చింది కానీ ముఖాలకు రంగులేసుకోవడం చాలా పురాతన ప్రక్రియ. అయితే అప్పుడు నాటకమేదో, జీవితమేదో కొంచెం తేడా తెలిసేది. ఇప్పుడు రెండూ కలిసిపోయి ఎవడి డైలాగులు వాడే ఇన్‌స్టంట్‌గా చెప్పేస్తున్నాడు. నా చిన్నప్పుడు మా ఊళ్లో రామాంజనేయ యుద్ధం నాటకం జరిగింది. మూడో ఆంజనేయుడు ఎవరికీ కనపడకుండా ఎక్కడో నిద్రపోయాడు. దాంతో రెండో ఆంజనేయుడే మూడో ఆంజనేయుడి అవతారం ఎత్తాడు. భారతంలో పద్యాలు పాడినా జనం వన్స్‌మోర్ అన్నారు. ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో తెలియకుండా నాటకం చూడడానికి జనం అలవాటు పడ్డారు. పూర్వం మైకులు లేకపోవడం వల్ల నటులు గట్టిగా అరిచేవాళ్లు. రాగం తీస్తే దోమలు జుమ్మంటూ టౌన్ గేటు వరకు ప్రయాణించేవి. మైకులొచ్చిన తరువాత కూడా కొంతమంది పరిషత్ నటులు గిట్టిగా గావుకేకలు పెట్టేవాళ్లు. వీళ్ల వల్ల రవీంద్రభారతిలో ప్రేక్షకులు స్పృహ కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సామాజిక స్పృహ ఎక్కువైతే వచ్చే ఇబ్బందే ఇది.
భటుడి వేషాన్ని ఏళ్ల తరబడి వేస్తున్న నటుడు ఒక్కసారిగా వేషం మార్చి తిరుగుబాటు వీరుడిగా మారితే రౌద్రానికి బదులు హాస్యరసం పుడుతుంది. పన్నీర్ సెల్వాన్ని పన్నీర్ బెటర్ మసాలాగా అంగీకరించకపోవడానికి కారణమిదే. పెద్దమ్మ కాళీమాత అయితే చిన్నమ్మ మహిషాసురమర్దిని. సివంగిని బోనులో పెట్టారు కానీ ఊచలు కొరికి ఎప్పుడైనా మీద పడుతుందని బోలెడంత మంది వణికి చస్తున్నారు.
నాటకాల కంటే తోలుబొమ్మలాట ఇంకొంచెం ఓల్డ్. ఈ ఆర్ట్‌కి సంబంధించిన ప్రసిద్ధ కళాకారులంతా ఢిల్లీలో ఉంటారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగులు అన్నీ వాళ్లే చెబుతూ ఉంటారు. బొమ్మలు మాట్లాడుతున్నాయని మనం భ్రమపడతాం. ఆడించేవాళ్లు అప్పుడప్పుడూ మారుతారు కానీ ఆట మారదు.
ఢిల్లీ నుంచి బుర్రకథ వినిపించడం కూడా మామూలే. అక్కడ కథ చెబితే ఇక్కడ పక్క వాయిద్యాలు వినిపిస్తూ తందాన అంటూ ఉంటారు. హోదా లేదు ప్యాకేజీనే అని బుర్ర కళాకారుడు అనగానే ఇక్కడి వాయిద్య నిపుణులు తాన తందనాన అంటారు. లేదంటే బుర్ర రామకీర్తనే.
ఢిల్లీలో ప్రసిద్ధ మెజీషియన్లు కూడా ఉంటారు. పావురాన్ని మాయం చేసి చిలకల్ని సృష్టించినట్లు, వెయ్యి రూపాయలు మాయం చేసి రెండు వేలు సృష్టిస్తారు. వెయ్యి వల్ల ముప్పు ఉంటే రెండువేల వల్ల రెండింతలు ముప్పు కదా! రెండు రెళ్లు నాలుగంటే కీళ్లు విరుగుతాయి. లెక్కల్లో కూడా సొంత అభిప్రాయాలు ఉంటేనే ముద్దు.
ఏనుగు తికమక పడి వరమాలని లె చ్చి మావటి మెళ్లో వేసినట్లు పళనిస్వామి నక్కతోకని తొక్కినా అది కరవకుండా కుర్చీలో కూచో పెట్టింది. రొట్టె విరిగి నేతిలో పడితే కొలెస్ట్రాల్ పెరిగితే పెరగవచ్చు కానీ, నెయ్యి రుచే వేరు. తేనె తాగుదామని కందిరీగల తుట్టెని కదిలించాడు పన్నీర్. కందిరీగలు కుడుతుంటే ఢిల్లీ వైఫై కూడా మోడెం ఆఫ్ చేసుకుంది. షేక్‌స్పియర్‌కి మించిన డ్రామా.. రాజకీయాల్లో ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఈగలు, దోమలు పోతున్నా లెక్క చేయకుండా ప్రజలు నోరెళ్లబెట్టి చూస్తూనే ఉంటారు.
– జి.ఆర్.మహర్షి