త్వరలో ‘క్లీన్ ఎయిర్ అథారిటీ’!
- దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు
- 24 జిల్లా కేంద్రాల్లో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు
- ‘నేషనల్ అర్బన్ డెవలప్‌మెంట్ సమ్మిట్’లో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరే ఇతర నగరంలో లేనివిధంగా హైదరాబాద్‌లో తొలిసారిగా ‘క్లీన్ ఎయిర్ అథారిటీ’ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. దీని ఏర్పాటుతో గాలి, నీరు తది తర కాలుష్యాలు లేకుండా ప్రజలు స్వచ్ఛమైన, నాణ్యమైన జీవన విధానాన్ని కొనసాగించవచ్చన్నారు. జపాన్‌లోని టోక్యో నగరంలో మాత్రమే ఇలాంటి అథారిటీ ఉందని, దాని స్ఫూర్తితోనే దీన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. శుక్రవారం ఇక్కడి హోటల్ మారియట్‌లో జరిగిన ‘నేషనల్ అర్బన్ డెవలప్‌మెంట్ సమ్మిట్’లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. ఈ అథారిటీ ఏర్పాటులో భాగంగా గ్రేటర్‌లోని దాదాపు 1,160 రెడ్, ఆరెంజ్ పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలకు తరలిస్తామన్నారు.
కాలుష్యం నగర ప్రజలకు పెద్ద సమస్య అని, పరిశ్రమల తరలింపుతో ఆ సమస్య పరిష్కారం కానుందన్నారు. దేశంలోని ఆయా నగరాలు అమలు చేస్తున్న వినూ త్న, ప్రయోజనకరమైన విధానాలన్నింటినీ క్రోడీకరించి, ఇతర నగరాలకు తెలియజేస్తే బాగుంటుందని సూచించారు. మూడున్నర లక్షల జనాభా ఉన్న నగరాలను, కోటి జనా భా ఉన్న నగరాలను ఒకే గాటన కట్టే స్మార్ట్‌సిటీస్ కాన్సెప్ట్ బాగాలేదని అభిప్రాయపడ్డారు.
50 % పెరగనున్న అర్బన్ జనాభా..
తెలంగాణలో ప్రస్తుతం 42 శాతం ఉన్న అర్బన్ జనాభా రాబోయే 15 ఏళ్లలో 50 శాతానికి పెరగనుందని కేటీఆర్ చెప్పారు. నగరాలు ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయని, ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థల అభివృద్ధికీ ఇవి కీలకమన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ట్రాఫిక్, తాగునీరు, సీవరేజి, పారిశుధ్యం తదితరమైనవి ప్రధాన సమస్యలంటూ వీటి పరిష్కారానికి తగిన స్మార్ట్ సొల్యూషన్స్ అవసరమన్నారు.
అంతర్గత వనరుల ద్వారా ఆదాయం..
తమిళనాడులో ఐదు వేల జనాభా దాటితే మున్సిపాల్టీగా మారుస్తున్నారని, అది మనకు సరిపడదన్నారు. మున్సిపాల్టీలుగా మారితే కేంద్రం నుంచి వచ్చే నిధులు, కొన్ని స్కీమ్‌లు వర్తించవన్నారు. రోడ్లు, చెరువులు, పారిశుధ్య నిర్వహణ తదితరమైనవి స్థానిక సంస్థల ప్రాథమిక విధులని, వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు అంతర్గత వనరుల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను ఆలోచిం చాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ సెక్రటరీ నవీన్‌మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమం డలి ఎండీ దానకిషోర్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డితోపాటు దేశంలోని వివిధ నగరాలకు చెందిన ఉన్నతాధికారులు ఆయా అంశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్‌పై ప్రసంగించారు.
24 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు
హైదరాబాద్‌ను క్లీన్, గ్రీన్‌గానే కాక లివబుల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణలోని ఆయా ప్రాం తాలను సమగ్రంగా అభివృద్ధి పరిచేందుకు 24 జిల్లా కేంద్రాల్లో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిఇంటికీ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ ఇచ్చేందుకు తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు చెప్పారు.