‘వనం-మనం’లో భాగస్వాములవుదాం
టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో/ హైదరాబాద్: ఈనెల 29న చేపట్టే ‘వనం-మనం’ కార్యక్రమంలో కోటి మొక్కలు నాటడంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సోమవారం ఆయన తన నివాసం నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు.
సోలార్ ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు జినర్జీ సంస్థ సంసిద్ధత
సౌర విద్యుత్ వినియోగంతో తక్కువ ఖర్చులో మంచినీటి శుద్ధి(ఆర్వో) ప్లాంట్లకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామంటూ జినర్జీ సంస్థ ప్రతినిధులు సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి ప్రతిపాదించారు. కాగా, బయోటెక్నాలజీ రంగంలో రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఎకో సిస్టం ఏర్పాటుచేయడానికి అమెరికాకు చెందిన ఫ్రాస్ట్ అండ్ సల్‌వాన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎంతో భేటీ అనంతరం కంపెనీ గ్లోబల్ అధ్యక్షుడు అనూప్ జుట్‌షీ ఈ విషయం చెప్పారు.
మెట్రోపై సమీక్ష : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. త్వరలో అనుమతి వచ్చే అవకాశం ఉందని ఈలోపు మిగిలిన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, మలేషియన్ ఆర్కిటెక్ట్ ఆర్‌డీ హరీష్ ముఖ్యమంత్రిని కలసి రాజధాని ప్రభుత్వ కాంప్లెక్స్ ఇతర భవనాల డిజైన్లపై చర్చించారు.
రాజ్యసభ సభ్యునిగా సుజనా ప్రమాణం
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి సోమవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ తరఫున రెండోసారి రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. కాగా, సుజనా తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు.