నచ్చకుంటే బండకేసి కొడతారు
♦ ప్రజల నిర్ణయాలు నిర్దాక్షిణ్యంగా ఉంటాయి జాగ్రత్త
♦ వారి మన్ననలు లేకుంటే భవిష్యత్తు ఉండదు
♦ ‘గ్రేటర్’ టీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ హితబోధ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘ప్రజలు తీసుకునే నిర్ణయాలు చాలా నిర్ధాక్షిణ్యంగా ఉంటాయి. వారికి నచ్చితే మెచ్చుకుంటారు. మళ్లీ మళ్లీ అవకాశాలు కల్పిస్తారు. నచ్చకుంటే బండకేసి కొడతారు. జాగ్రత్తగా ఉండండి.’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ పట్టణ ప్రజాప్రతినిధులకు హితబోధ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు ఏర్పాటు చేసిన మూడు రోజుల పునశ్చ రణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అఖండ విజయా న్ని సొంతం చేసుకుంది.
ఇందులో తొలిసారి గెలిచిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ గెలుపు ప్రజలిచ్చిన అవకాశంగా భావించండి. తిరిగి గెలవాలంటే ప్రజల మన్ననలు పొందాల్సిందే. ఆ మేరకు కష్టపడాలి’’ అని సీఎం సూచించారు. అధికారంలో ఉండి చేయాల్సిన పనులు కూడా చేయకపోవడమనేది నేరం చేసినట్లేనన్నారు. హైదరాబాద్ నగరం తనకున్న విశిష్ట లక్షణంతో ఇన్నాళ్లు మనగలిగిం దని, గత పాలకులు చేసింది శూన్యమన్నారు. వర్షపు నీటిని అదుపు చేసే కనీస సాంకేతిక విధానాన్ని గత పాలకులు విస్మరించారని కేసీఆర్ విమర్శించారు.
నగరంలో కీలక ప్రదేశాలైన అసెంబ్లీ, రాజ్‌భవన్, సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రాంతాల్లో నీళ్లు నిలిచి ఉండటం శోచనీయమన్నారు. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు మునగకుండా నివారించాలంటే రూ. 11 వేల కోట్లు అవసరమని అధికారులు చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. నగర మేయర్‌కు నివాసం లేకుండా సాగిన 60 ఏళ్ల పాలన దారుణమన్నారు. నగర జనాభాకు అనుగుణంగా కూరగాయల మార్కెట్లు, బస్టాపులు, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంపై కార్పొరేటర్లు దృష్టి సారించాలన్నారు. నాగ్‌పూర్, ఢిల్లీ నగరాలను సందర్శించి అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయాలని కార్పొరేటర్లకు సీఎం సూచించారు.
విభజించారు.. అభివృద్ధిని అడ్డుకున్నారు..
మానవ వనరుల్ని వినియోగంలోకి రాకుండా కొన్ని శక్తులు అభివృద్ధిని అడ్డుకున్నాయని కేసీఆర్ ఆరోపించారు. కులాల పేరిట గ్రామ పొలిమేరలు, అటవీ ప్రాంతాల్లోకి ప్రజలను తరిమేశారని, జనాభాలో సగభాగమైన మహిళల్ని వంటింటికి పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఉత్పాదక రంగానికి ప్రజల్ని దూరం చేశారన్నారు. అన్ని వర్గాలు ఏకమైతేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలకు సేవచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. మనిషి ఎదుగుదలకు జ్ఞానమే కారణమని, ఇందుకోసం నిత్య విద్యార్థిగా సాధన చేయాల్సిందేనని, ప్రజాప్రతినిధులకు ఈ సూత్రం చాలా ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో ఆస్కీ (అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజి) చైర్మన్ పద్మనాభయ్య, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మహేందర్‌రెడ్డి, కె.తారకరామారావు, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అధికారులతో జర భద్రం...
అధికారగణంతో జాగ్రత్తగా మెల గాలని కార్పొరేటర్లకు కేసీఆర్ సూచిం చారు. ‘‘కొన్ని సందర్భాల్లో అధికారులు మీ వద్దకు వచ్చి లేనిపోని మాటలు చెప్పి చెడగొట్టే ప్రయత్నం చేస్తరు. వాటిని విశ్లేషించి నీతి నిజాయతీలతో ముందుకెళ్లండి. ప్రజల రుణం తీర్చుకునే దిశగా సాగండి’’ అని సీఎం పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గడువులోగా హామీని అమలు చేస్తామన్నారు. నగరంలో చెత్త తొలగింపు కష్టమైన విషయం కాదని, కార్పొరేటర్లు తలచుకుంటే నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దొచ్చన్నారు. ఐలాండ్ పవర్ సప్లయ్ ద్వారా నగరానికి నిరంతర విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు.