
దళితుల హక్కులు కాలరాస్తున్న సీఎం
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తూ తప్పుడు లెక్కలతో మసిపూసి మారేడుకాయ చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత, గిరిజనులకు చెందాల్సిన నిధులు పచ్చచొక్కాలపరమవుతున్నాయని ఆరోపించారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు జీవోలు, దొంగ లెక్కలు చూపిస్తూ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2015-16కుగానూ ప్రణాళిక వ్యయం రూ.38,671 కోట్లకు రివైజ్డ్ బడ్జెట్‌లో రూ.38,671 కోట్లు చూపించగా.. అందులో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రూ.6,613 కోట్లు రావాల్సి ఉంటే రూ.4,045 కోట్లిచ్చి రూ.2,568 కోట్లు ఎగ్గొట్టారన్నారు. ఎస్టీలకైతే రూ.2,601 కోట్లు రావాల్సి ఉండగా రూ.1,320 కోట్లు ఖర్చుచేసి రూ.740 కోట్లు ఎగ్గొట్టారన్నారు. దీన్ని బట్టి దళితులపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతోందన్నారు.