కోడ్ బ్రేక్
జలమండలి పథకాలకు ఎన్నికల కోడ్ బ్రేకులు వేస్తోంది. రూకల్లోతు నష్టాల్లో ఉన్న జలమండలి రూ.878 కోట్ల నీటిబిల్లు బకాయిలు వసూలు చేసుకునేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో వన్‌టైమ్‌సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. సుమారు మూడు లక్షల మంది బకాయిదారులకు పెండింగ్ నీటిబిల్లులు చెల్లించేందుకు ఈ నెల 31 వరకు గడువునిచ్చింది.
ఆలోగా చెల్లించిన వారికి వడ్డీ మాఫీ ప్రకటించింది. కానీ ఈ పథకం ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందో? రాదో? అన్న సంశయంతో జలమండలి అధికారులు వారం క్రితం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అక్కడి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. మరోవైపు అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకానిదీ ఇదే పరిస్థితి. గ్రేటర్ పరిధిలో సుమారు 1.50 లక్షల వరకు ఉన్న అక్రమ కుళాయిలను కూడా మార్చి 31 వరకు క్రమబద్ధీకరించుకునేందుకు స్వచ్ఛంద క్రమబద్ధీకరణ పథకం (వీడీఎస్) ప్రవేశపెట్టింది. ఈ పథకం కూడా కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న అనుమానంతో అధికారులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. కానీ ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
గోదావరి రుణానికీ చిక్కులు
కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారులోని శామీర్‌పేట్ వరకు 186 కిలోమీటర్ల మేర జరుగుతున్న గోదావరి మంచినీటి పథకానికి హడ్కో సంస్థ రూ.వెయ్యి కోట్లు రుణ మంజూరుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ రుణ మంజూరుకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి పూచీకత్తు (కౌంటర్ గ్యారంటీ) కోరింది. కానీ కోడ్ నేపథ్యంలో పూచీకత్తు ఇచ్చే విషయంలో ఆర్థికశాఖ అధికారులు కూడా సంశయంలో పడినట్లు విశ్వసనీయంగా తెలి సింది. దీంతో గోదావరి పథకానికి రుణ మంజూరు విషయం కూడా డైలమాలో పడినట్లు సమాచారం.
నష్టాలు గట్టెక్కేదెలా..?
బోర్డు నష్టాలను తగ్గించుకునేందుకు బకాయిల వసూలు మినహా ప్రత్యామ్నాయం లేదని గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. వన్‌టైమ్ సెటిల్‌మెంట్, అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టారు. నెలకు రూ.29 కోట్ల నష్టాలతో నెట్టుకొస్తున్న జలమండలికి సత్వరం బకాయిలు వసూలు చేసుకోని పక్షంలో నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీంతో బోర్డు వర్గాలు తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం అనుమతి లభిస్తేనే ఈ పథకాలను అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపాయి.