
పరీక్షల నిర్వహణకు సహకరించం
ప్రైవేటు విద్యా సంస్థల్లో పోలీసు, విజిలెన్స్ తనిఖీలను నిలిపివేసే వరకు పాలీసెట్, కానిస్టేబుల్, ఎంసెట్ పరీక్షలకు సహకరించమని, తమ కాలేజీల్లో పరీక్షలను జరగనివ్వమని తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ స్పష్టం చేసింది.
♦ విజిలెన్స్ తనిఖీలు ఉపసంహరించే వరకు అంతే..
♦ విద్యా సంస్థల బంద్ కొనసాగుతుంది
♦ తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో పోలీసు, విజిలెన్స్ తనిఖీలను నిలిపివేసే వరకు పాలీసెట్, కానిస్టేబుల్, ఎంసెట్ పరీక్షలకు సహకరించమని, తమ కాలేజీల్లో పరీక్షలను జరగనివ్వమని తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో పోలీసు తనిఖీలను ఉపసంహరించాలని కోరుతూ సోమవారం నుంచి ప్రారంభమైన విద్యాసంస్థల బంద్ కొనసాగిస్తామని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం జేఏసీ నేతలు సమావేశమై బంద్, సహాయ నిరాకరణను కొనసాగించాలని నిర్ణయించారు. తనిఖీలను వెంటనే ఆపాలంటూ డీజీపీ అనురాగ్ శర్మను, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డిని జేఏసీ నేతలు గౌతంరావు, రమణరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రామ్‌దాస్ కలసి వినతి పత్రాలు అందజేశారు.
పాలీసెట్‌పై ఏం చేయాలి?
యాజమాన్యాల జేఏసీ నిర్ణయంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి పాలీసెట్ పరీక్ష నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ యాజమాన్యాలు తమ కాలేజీల్లో పరీక్షలను నిర్వహించనీయమని, నిరవధిక బంద్ కొనసాగిస్తామని ప్రకటించడంతో ఆందోళనలో పడింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ వివిధ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను కూడా కేటాయించారు. ఇపుడు విద్యా సంస్థలను మూసేయడం వల్ల పరీక్ష ఆగిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సీఎం కేసీఆర్‌తో మంగళవారం చర్చించాక నిర్ణయం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.
పరీక్షలు యథాతథం: అధికారులు
జేఎన్‌టీయూ, ఓయూ పరిధిలో పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఆ వర్సిటీ ల పరీక్షల విభాగాధికారులు స్పష్టం చేశా రు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలకు హాజ రు కావాలన్నారు. జేఎన్‌టీయూ పరి ధిలో మిడ్ ఎగ్జామ్స్ ప్రారంభం కాగా.. ఓయూ పరిధిలో బీ ఫార్మసీ, ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్‌మెంట్ తదితర వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. బంద్‌పై ఎటువంటి ఆదేశాలు తమకు అందలేదని, కాబట్టి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఓయూ పరీక్షల నియంత్రణాధికారి అప్పారావు, జేఎన్‌టీయూ పరీక్షల విభాగం అధికారి ఆంజనేయ ప్రసాద్ వివరించారు.
పోలీసులతో విచారణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసులతో విచారణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రమణా రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ నేతలు సోమవారం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసులతో కాకుండా ఉన్నత విద్యా శాఖ, విశ్వవిద్యాలయ అధికారులతో విచారణ జరిపించాలన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి తనిఖీలకు ఆరు నెలలు గడువు ఇవ్వాలని కోరారు.