పోలవరానికి శాపం.. సర్కారు పాపమే! | Comprehensive Report on Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరానికి శాపం.. సర్కారు పాపమే!

Published Mon, May 23 2016 1:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

పోలవరానికి శాపం.. సర్కారు పాపమే! - Sakshi

పోలవరానికి శాపం.. సర్కారు పాపమే!

కేంద్రానికి నేడు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ నివేదిక?
 
- ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ర్ట ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
- 37 నెలల్లో జరిగింది10 శాతం పనులే..
- అనుమతులు లేని పట్టిసీమపై అంత శ్రద్ధా?
- క్షేత్రస్థాయి పరిశీలనలో నివ్వెరపరిచే వాస్తవాలు..
- అన్ని వివరాలు.. సూచనలతో సమగ్ర నివేదిక
 
 సాక్షి, హైదరాబాద్:
అది రాష్ట్రానికే వరప్రదాయినిగా భావిస్తున్న బహుళార్థసాధక ప్రాజెక్టు... రెండు నదులను అనుసంధానం చేసి అనేక ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించగలిగే భారీ ప్రాజెక్టు. అదే పోలవరం. అంతటి ప్రాధాన్యత గలిగిన ప్రాజెక్టు విషయంలో రాష్ర్టప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి..? సమర్థుడైన కాంట్రాక్టర్ ఎంపిక, తగినన్ని నిధుల కేటాయింపు, పనుల పర్యవేక్షణ వంటివన్నీ ఎంతో పకడ్బందీగా జరగాలి. కానీ అంతులేని నిర్లక్ష్యం.. అన్నీ అవకతవకలు... ఏదీ సరిగా లేదు... అసమర్ధుడైన కాంట్రాక్టరు.. అరకొర నిధులు.. అందులోనే మొబిలైజేషన్ అడ్వాన్సులు.. అకారణంగా పెరిగిపోతున్న అంచనా వ్యయం... ఇవన్నీ చూసి కేంద్ర ఉన్నతస్థాయి సాంకేతిక నిపుణుల కమిటీ నిర్ఘాంతపోయింది.

ఈనెల 16,17 తేదీల్లో క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఈ కమిటీ 18న హైదరాబాద్‌లో రాష్ర్ట జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించింది. అనంతరం ఓ సమగ్రమైన నివేదికను తయారు చేసింది. సోమవారం నాడు ఆ నివేదికను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి అందించనున్నది. పోలవరం విషయంలో రాష్ర్టప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధీ లేదని కమిటీ కుండబద్దలుకొట్టింది. పోలవరం విషయంలో జరుగుతున్న అన్ని అనర్ధాలకు అదే కారణమని తేల్చింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు నివేదికలోని అంశాలు, కమిటీ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...

 2018లోగా ఎలా పూర్తి చేస్తారు?
 రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లేమి,  సత్తా లేని కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడం.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)తో ఒప్పందం చేసుకోవడంలో జాప్యం.. వంటివన్నీ పోలవరానికి పెను శాపంలా మారాయని కేంద్ర ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఇప్పటివరకూ పది శాతం పనులు మాత్రమే పూర్తయినా 2018లోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోండటంపై కమిటీ విస్తుపోయింది. అనవసరమైన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంలో రాష్ట్రానికి ఉన్న శ్రద్ధ పోలవరంపై లేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులు గాడిలో పెట్టాలన్నా సకాలంలో పూర్తి చేయాలన్నా పీపీఏకి పూర్తి బాధ్యతలు అప్పగించాలని సూచించింది.

 కాంట్రాక్టు సంస్థకు అనుభవమేది?
 పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులను 37 నెలల క్రితం ట్రాన్స్‌ట్రాయ్(ఇండియా) లిమిటెడ్‌తో పాటు రష్యా, ఒమన్ దేశాలకు చెందిన కంపెనీల భాగస్వామ్యంతో కూడిన జాయింట్ వెంచర్ ‘ట్రాన్స్‌ట్రాయ్-జాయింట్ స్టాక్ కంపెనీ-యునెటైడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్) చేజిక్కించుకుంది. ఈ జాయింట్ వెంచర్‌లో ట్రాన్స్‌ట్రాయ్ వాటా కేవలం 18 శాతం మాత్రమే. మిగతా 82 శాతం వాటా రష్యా, ఒమన్ దేశాలకు చెందిన కంపెనీలది. కానీ.. అతి తక్కువ వాటా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్ మాత్రమే పనులు చేస్తోంది. రష్యా, ఒమన్ దేశాలకు చెందిన కంపెనీలు పనులు చేయకపోవడాన్ని  క్షేత్రస్థాయి పర్యటనలో కేంద్ర కమిటీ గుర్తించింది.

అనుభవాన్ని కాగితాల మీద చూపించి కాంట్రాక్టు కొట్టేయడానికి విదేశీ కంపెనీలను ట్రాన్స్‌ట్రాయ్ వాడుకుందని కేంద్ర కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. ఒకవేళ విదేశీ కంపెనీలు పనులు చేసి ఉంటే.. పోలవరం హెడ్ వర్క్స్ పనుల్లో పురోగతి ఉండేదని అభిప్రాయపడింది. 37 నెలల్లో కేవలం పది శాతం పనులు మాత్రమే పూర్తయినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2018లోగా పనులు పూర్తి చేస్తామని చెబుతోండటంపై కేంద్ర కమిటీ విస్తుపోయింది. పనులను పూర్తి చేయడానికి కనీసం టైం షెడ్యూల్ కూడా రూపొందించకపోవడాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి అర్ధమౌతుందని ఎత్తి చూపింది.

 పీపీఏతో ఒప్పందంలో జాప్యమెందుకు?
 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్(90)(1)(2)(3)(4)లో పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టి సకాలంలో పూర్తి చేస్తుందని.. ఆ బాధ్యతను స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)గా ఏర్పాటుచేసే పీపీఏ చేపడుతుందని పేర్కొన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తప్పుబట్టింది. పీపీఏతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని.. నిధుల వినియోగంపై మార్గదర్శకాలను రూపొందించి ఉంటే ఈ దుస్థితి ఉత్పన్నమయ్యేది కాదని అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసిన తీరును కేంద్ర కమిటీ తూర్పారబట్టింది. ప్రాజెక్టులు పనులు చేసేందుకు యంత్ర, సామగ్రి కొనుగోలు చేసిన తర్వాత వాటిని ప్రభుత్వానికి తాకట్టు పెట్టాలన్న షరతుతో ‘ట్రాన్స్‌ట్రాయ్-జేఎస్‌సీ-యూఈఎస్’కు రూ.250 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో చెల్లించినా.. కాంట్రాక్టు సంస్థ నిబంధనలను తుంగలో తొక్కిందని తేల్చింది.

కాంట్రాక్టు అగ్రిమెంటులో 49(2)(2) ప్రకారం.. యంత్ర, సామగ్రి అంతా జాయింట్ వెంచర్ పేరు మీద కొనుగోలు చేయాలి. కానీ.. ట్రాన్స్‌ట్రాయ్ పేరు మీద మాత్రమే కొనుగోలు చేసిన యంత్ర, సామగ్రిని  ప్రభుత్వానికి తాకట్టు పెట్టకపోవడాన్ని ఎత్తిచూపింది. జాయింట్ వెంచర్ పనులు పూర్తిచేయకపోవడంతో.. ఎల్ అండ్ టీ, బావర్(జర్మనీ) కంపెనీలను తెరపైకి తెచ్చి.. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థలకూ రూ.50 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించడాన్ని కేంద్ర కమిటీ గుర్తించింది. ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుది కావడం వల్లే అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అభిప్రాయపడిందని సమాచారం.

 ధరలు పెరగకపోయినా.. పెరిగిన అంచనా వ్యయం..
 పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచుతూ పోవడంపై కేంద్ర కమిటీ నివ్వెరపోయింది. 2005-06 ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లతో అంచనాలు రూపొందించి.. ఆ తర్వాత దాన్ని 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లకు పెంచామని హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో జలవనరుల శాఖ  ఉన్నతాధికారులు కేంద్ర కమిటీకి వివరించారు. ప్రస్తుత ధరల ప్రకారం కనీసం మరో రూ.1,500 కోట్ల మేర అంచనా వ్యయం పెంచే ప్రతిపాదన ఉందని చెప్పడంతో కేంద్ర కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు.

యంత్ర సామగ్రి, ఇనుము, డీజిల్ వంటి వాటి ధరలు పెరగకపోయినా అంచనా వ్యయం పెంచడంపై విస్తుపోయారు. రూ.1,300 కోట్ల అంచనాతో చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతలను యుద్ధప్రాతిపదికన ఏడాదిలో పూర్తి చేశామని, అదే తరహాలో పోలవరంనూ 2018లోగా పూర్తి చేస్తామని ఆదిత్యనాథ్ దాస్ చెప్పడాన్ని కమిటీ సభ్యులు తప్పుపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే కుడికాలువ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చునని.. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకున్నా పట్టిసీమను ఎందుకు చేపట్టారని కేంద్ర కమిటీ నిలదీసినట్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.  క్షేత్ర స్థాయిలోనూ.. సమీక్షలోనూ వెల్లడైన అంశాల ఆధారంగా.. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాలంటే పీపీఏకు పూర్తి బాధ్యతలు అప్పగించడం ఒక్కటే మార్గమని ఈ కమిటీ తన నివేదికలో సూచించినట్లు సమాచారం.
 
 ఇదీ కేంద్ర ఉన్నతస్థాయి కమిటీ..
 ఏప్రిల్ 20న హైదరాబాద్‌లో జరిగిన పోలవరం ప్రాజెక్టు అధారిటీ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై చైర్మన్ అమర్జీత్‌సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నివేదిక ఇచ్చేందుకు ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ పాండ్య అధ్యక్షతన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనేషన్(సీడీవో) రిటైర్డ్ ఇంజనీర్- ఇన్-చీఫ్ హోండా, ఎన్‌హెచ్‌ఈపీ మాజీ డెరైక్టర్ సి.భార్గవ సభ్యులుగా ఈ కమిటీ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement