సుచరిత పేరును ప్రతిపాదించిన టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి రాంరెడ్డి సుచరితకు టికెట్ ఇవ్వాలని టీపీసీసీ సిఫారసు చేసింది. వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు సుచరిత పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తూ... ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం లేఖ రాశారు.
పాలేరులో దివంగత ఎమ్మెల్యే వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తున్నందున.. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని పలు పార్టీలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీటీడీపీ, సీపీఐ, సీపీఎంలకు శనివారం లేఖలు రాశారు. పాలేరు ఎమ్మెల్యే వెంకటరెడ్డి అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించారని... దీంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన కుటుంబ సభ్యులకే కాంగ్రెస్ అవకాశం ఇస్తోందని లేఖల్లో పేర్కొన్నారు. అందువల్ల పాలేరులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు..