దిశ లేని హస్తం ఐడియా | congress has idea for elections | Sakshi
Sakshi News home page

దిశ లేని హస్తం ఐడియా

Published Sun, Apr 13 2014 2:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

దిశ లేని హస్తం ఐడియా - Sakshi

దిశ లేని హస్తం ఐడియా

కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల జపం
 
 పసునూరు మధు
 ‘ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కూడా కనిపెట్టింది. దాని పేరుతోనే 2014 ఎన్నికల హామీల ప్రణాళికను రూపొం దించింది. అయితే ఈ ఐడియా తెలంగాణ ప్రజల జీవితాలను మార్చే దిశలో లేదనేది కాంగ్రెస్ మేనిఫెస్టో విశ్లేషణలోని ముఖ్యాంశం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చామన్న ఏకైక మంత్ర పఠనంతో ఓట్ల పంట పండేట్టు లేదనీ, క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు మరింత విస్తృత స్థాయిలో ఉన్నాయనీ కాంగ్రెస్ గుర్తించింది. దీంతో ఎడాపెడా వరాల ప్రకటనకు పూనుకుంది. ఆ హామీల్లో కొన్ని ఇప్పటికే ఆచరణలో ఉన్నవి కాగా, మరికొన్ని ఇప్పటివరకు అధికారంలో ఉండి ఆచరణలో పెట్టలేనివి కొన్ని. విపక్షాల హామీలను చూసి పెట్టుకున్న వాతలు కొన్ని.
 
 పాత హామీలు తూచ్..
 
 2009 ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా రెండు హామీలిచ్చి అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ఈసారి వాటిని తేలికగా తీసుకుంది. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 30 కిలోల బియ్యం ఇస్తామని నాటి ప్రణాళికలో పేర్కొన్నారు. గత ఐదేళ్లలో దాని అమలు మరిచిన కాంగ్రెస్ పెద్దలు ఈసారి మేనిఫెస్టోకు వచ్చేసరికి ఆ అంశాన్నే ఎత్తిపారేశారు. గత మేనిఫెస్టోలో 9 గంటలపాటు రైతులకు ఉచిత కరెంట్‌ను ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీలో ఒకటి. ఈసారి ఆ హామీకి పాతరేసి 7 గంటలపాటు ఉచిత కరెంట్ ఇస్తామంటూ తమ హామీని తామే కుదించుకున్నారు. పైగా సౌర విద్యుత్ యూనిట్ల స్థాపన ద్వారా, సోలార్ ప్యానల్‌తో పంపుసెట్లు ఇస్తామంటూ...పరోక్షంగా ఉచిత కరెంటుకు ఆంక్షలు ఉండబోతున్నాయనే సంకేతాలను ఇచ్చినట్లయింది. జలయజ్ఞానికి సంబంధించి నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయని కాంగ్రెస్ ఈసారి మేనిఫెస్టోలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సంగతే మర్చిపోయింది.  తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించలేని కాంగ్రెస్ ఇపుడు ఆ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చడం హాస్యాస్పదంగా ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సాధ్యాసాధ్యాలు చర్చే లేకుండా దానికీ జాతీయ హోదా అంటూ మరొక హామీ అంటూ ఉదారంగా ఇవ్వడం విశేషం. పైగా రాష్ర్టంలోని 35,974 చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తామనే హామీని పొందుపర్చిన కాంగ్రెస్ పెద్దలు పరోక్షంగా జలయజ్ఞం పథకాన్ని వదిలేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.
 
 ‘ప్లాన్’అమలవుతుందా...!
 
 8 ఏళ్ల సర్వీసున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ-కాంట్రాక్టు ఉద్యోగాలపై నిషేధంపై కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకునే ముందు ఏ శాఖ అయినా ఒక సంవత్సర కాలానికే నియామక ఉత్తర్వులను ఇవ్వడం పరిపాటి. విద్యా వలంటీర్లకైతే 10 నెలలకే పరిమితం. ప్రతి ఏటా పునరుద్ధరిస్తుంటారు. ఈ స్థితిలో 8 ఏళ్ల సర్వీస్ ఎలా సాధ్యమో కాంగ్రెస్ పెద్దలే చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో దాన్ని అటకెక్కించింది. ఇక మైనారిటీ, బీసీల సబ్‌ప్లాన్‌పై ఇస్తున్న హామీ ఏ మేరకు విశ్వసనీయమో? అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు టైటిల్ జారీ చేస్తామనేది మరో హామీ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తి చేసిన విషయాన్ని కాంగ్రెస్ పాలకులు విస్మరించారు. అలాగే నాలుగేళ్లలో బెల్టుషాపులు పల్లెపల్లెకూ, తండాతండాకూ విస్తరించిన కాంగ్రెస్ పాలకులు ఇపుడు వాటిని నియంత్రిస్తారట!!
 
 ఈ వాతల్లో చిత్తశుద్ధి ఎంత?
 
 వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి ఇస్తున్న ప్రధాన హామీల్లో డ్వాక్రా రుణాల మాఫీ ఒకటి. రాష్ర్టవ్యాప్తంగా మహిళలు ఆకాంక్షిస్తున్న ఈ కార్యాచరణ విషయంలో కాం గ్రెస్ యథాతథంగా ఆ స్ఫూర్తిని పొందుపర్చలేక ఒక్కో సంఘానికి లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని ఇస్తామని మాత్రమే ప్రకటించింది. అలాగే చంద్రబాబు ప్రవచిస్తున్న రైతు రుణాల మాఫీ నిజానికి ఒక రాష్ర్ట ప్రభుత్వానికి సాధ్యంకాదు. అది కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. గతంలో వైఎస్ యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతు రుణాలను మాఫీ చేయించగలిగారు. తాజా మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఒక్కో రైతుకు కేవలం రూ. 10వేలు ప్రోత్సాహం ఇస్తామని చేతులు దులుపుకొంది. ఏటా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నది మరో ప్రధాన హామీ. కానీ తెలంగాణ అవసరాలు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల మొత్తాన్ని లెక్కేసినా అందులో సగమైనా ఉండవని నిపుణుల అంచనా. మరి లక్షలాది కొత్త పోస్టులు ఏయే విభాగాల్లో సృష్టిస్తారో కాంగ్రెస్ పెద్దలే చెప్పాలి.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement