గ్రేటర్లో కాంగ్రెస్కు భారీ షాక్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ ఎన్నికల్లో కేవలం రెండే సీట్లు నెగ్గింది. పటాన్ చెరు, నాచారం డివిజన్లలో గెలుపొందింది.
గత గ్రేటర్ ఎన్నికల్లో 52 డివిజనల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్-ఎంఐఎంతో కలసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున బండ కార్తీక రెడ్డి మేయర్గా ఎన్నిక కాగా, ఆనక ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్కు మేయర్ పదవిని అప్పగించారు. అయితే తాజా ఎన్నికల్లో సీన్ మారింది. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రం గౌడ్ తో పాటు మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి కూడా పరాజయం పాలయ్యారు.
ఇక తెలంగాణ ఇచ్చింది తామేనని, తమకే ఓటేయాలని సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసినా ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. కాంగ్రెస్ ఓటమికి ఎన్నో కారణాలుండగా, స్వయం కృతాపరాధంతో కూడా మూల్యం చెల్లించుకుంది. గతంలో మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కాంగ్రెస్కు దూరమైంది. ఒంటరిగా గ్రేటర్ ఎన్నికల్లో బరిలో దిగిన కాంగ్రెస్ తరపున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సహా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీసీఎల్పీ నాయకుడు జానారెడ్డి, ఇతర రాష్ట్ర స్థాయి నేతలు, గ్రేటర్ నేతలు విస్తృతంగా ప్రచారం చేసినా కాంగ్రెస్కు నిరాశ తప్పలేదు. గ్రేటర్లో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాలేకపోయారు.
గ్రేటర్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరగడం పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసింది. అంతేగాక, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు, దానం వర్గీయుల మధ్య విభేదాలు ఏర్పడం కొంపముంచింది. ఇక ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి అధికార పార్టీకి లాభం చేకూర్చేలా వ్యవహరించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న రూ. 5 భోజన పథకం బాగుందని జానారెడ్డి ప్రశంసించడమే దీనికి కారణం. జీహెచ్‌ఎంసీ భోజనం సూపర్ అంటూ ప్రతిపక్ష నేత కితాబు ఇవ్వడం వల్ల తమకు లబ్ధి కలుగుతుందని టీఆర్ఎస్ నాయకులు భావించినట్టే జరిగింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరడం కూడా నష్టం కలిగించింది.