ఎంఐఎంతో కాంగ్రెస్ తెగతెంపులు!
శాసనమండలి ఛైర్మన్ పదవికి ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మంగళవారం మద్దతు ప్రకటించింది. దాంతో ఎంఐఎంకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ మేయర్ పదవికి అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. శాసనమండలిలో మొత్తం 35 మంది సభ్యులు ఉన్నారు. వారిలో అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీకి 15 మంది, కాంగ్రెస్ పార్టీకి 12 మంది, ఎంఐఎం 2, పీడీఎఫ్ 1, ఇతరులు 1 ఉన్నారు.
శాసనమండలి ఛైర్మన్ పదవికి ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. స్వామిగౌడ్ ఎమ్మెల్సీ ఛైర్మన్గా ఎంపిక చేయాలని ఇప్పటికే తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే శాసన మండలిలో ఇద్దరు ఎంఐఎం సభ్యులు ఉన్నారు. వారు టీఆర్ఎస్ మద్దతు తెలపనున్నారు. ఇటీవల పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం విదితమే. దాంతో టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీల సంఖ్య 15కు చేరుకుంది. శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక బుధవారం జరగనుంది.