రైతుల ఆత్మహత్యలపై భగ్గుమన్న విపక్షాలు
ఆందోళనల మధ్యే మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం
కాంగ్రెస్, టీడీపీ సభ్యుల నిరసన..
బడ్జెట్ కాపీలను చించేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ సభ్యుల ఆందోళన మధ్య శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యులు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించినప్పట్నుంచే రైతుల ఆత్మహత్యలపై ప్రకటన చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బడ్జెట్ తర్వాత బీఏసీలో చర్చిద్దామని మండలి చైర్మన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆందోళన కొనసాగించారు. తాము బడ్జెట్‌కు వ్యతిరేకం కాదని, ముందుగా ప్రకటన చేయాలని పట్టుబడుతూ పలుమార్లు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లారు.
మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ మాత్రం పోడియం వద్దకు వెళ్లకుండా తన సీటు వద్దే ఉండి నిరసన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైతులను కాపాడండి.. ఆత్మహత్యల నుంచి తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలి.. రోగాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడండి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి’ అని నినాదాలు చేశారు. బడ్జెట్ ప్రసంగం కొనసాగినంత సేపూ ప్లకార్డులను ప్రదర్శించారు. నలుపు కండువాలు మెడలో వేసుకొని నిరసన వ్యక్తంచేశారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తుండటంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రవీందర్ తదితరులు లేచి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ ఆందోళన మధ్య డి.శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై ప్రకటన చేయాలని కోరారు. ఆ తర్వాత రాజయ్య తన ప్రసంగం కొనసాగించారు. అయినా విపక్ష సభ్యులు మళ్లీ ఆందోళనను కొనసాగించారు. దీంతో మరో రెండుసార్లు డి.శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు.
చివ రిసారి ఆయనకు మైక్ ఇచ్చినా... మంత్రి తన ప్రసంగాన్ని కొన సాగించారు. బీజేపీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ తన సీటు వదే ్ద నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెచ్చిన ప్లకార్డును తీసుకొని, ఆ పార్టీ పేరు కనిపించకుండా పట్టుకొని ప్రదర్శించారు. బడ్జెట్ ప్రసంగం చివరికి చేరుకునే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు బడ్జెట్ ప్రతులను చించి, సభలో సభ్యులపైకి విసిరివేశారు. వారి ఆందోళనల నడుమే మండలిని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.