
ఉదయం ఎండ.. సాయంత్రం ఠండా
ఉదయమంతా ఎండ వేడిమితో సతమతమైన హైదరాబాద్‌వాసులకు సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కురి సిన చిరుజల్లులు ఉపశమనమిచ్చాయి.
- నగరవాసులకు ఉపశమనం..
- రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు మరో 53 మంది మృతి
సాక్షి, నెట్‌వర్క్/హైదరాబాద్: ఉదయమంతా ఎండ వేడిమితో సతమతమైన హైదరాబాద్‌వాసులకు సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కురి సిన చిరుజల్లులు ఉపశమనమిచ్చాయి. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో ఐదు రోజులపాటు నగరంలో చిరుజల్లులు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 0.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. వడదెబ్బకు గురై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 53 మంది మృతి చెందారు. వరంగల్ జిల్లాలో 13 మంది, ఖమ్మం జిల్లాలో 11 మంది, కరీంనగర్ జిల్లాలో 8 మంది, మహబూబ్‌నగర్‌లో ఐదుగురు, నల్లగొండ జిల్లాలో 8 మంది, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున బలయ్యారు. రామగుండంలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ప లుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.
ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
రామగుండం 45.0
నిజామాబాద్ 43.6
ఆదిలాబాద్ 43.0
భద్రాచలం 42.8
నల్లగొండ 42.6
ప్రాంతం ఉష్ణోగ్రత
మెదక్ 42.5
మహబూబ్‌నగర్ 42.4
ఖమ్మం 42.2
హన్మకొండ 42.1
హైదరాబాద్ 40.4