జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీచేసే అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితి రూ.2 లక్షలు కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నామినేషన్ డిపాజిట్‌గా రూ.2,500, ఓసీ,బీసీలకు రూ.5,000లుగా నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం టూరిజం ప్లాజాలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
జనవరి 31వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలన్న కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వార్డుల పునర్విభజన, ఎన్నికల జాబితా పూర్తి తదితర పనులు పూర్తి చేశామని చెప్పారు. వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నట్లు వివరించారు.