కేసుల ఉపసంహరణపై కౌంటర్ వేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రులు, అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేంత వరకూ కింది కోర్టుల్లో కేసుల ఉపసంహరణ పిటిషన్లు విచారణకు వస్తే వాయిదా తీసుకుంటామంటూ అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఇచ్చిన హామీని హైకోర్టు నమోదు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది.
టెండర్లు పిలవకుండా ప్రసార హక్కులా?
ఎటువంటి టెండర్లను ఆహ్వానించకుండానే ఆంధప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల హక్కులను ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చెందిన అడ్వాన్డŠస్ కమ్యూనికేషన్స్‌కు కట్టబెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. టెండర్లు ఆహ్వానించకుండా కేవలం నామినేషన్ పద్ధతిపైనే ప్రత్యక్ష ప్రసారాల హక్కులను అడ్వాన్డŠస్ కమ్యూనికేషన్స్‌కు అప్పగించడంపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఇందులో భాగంగా న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, అడ్వాన్డ్స్ కమ్యూనికేషన్స్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.