ముగ్గురు బుకీల అరెస్టు
రూ.4.10 లక్షలు స్వాధీనం
సిటీబ్యూరో: సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు నగర శివార్లలోని క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలపై గురువారం వరుస దాడులు చేశారు. తివారీ, మోహన్‌లాల్, వెంకట్రాంరెడ్డి అనే బుకీలను అరెస్టు చేశారు. వీరితో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న పలువురిని అరెస్టు చేశారు. బుకీల వద్ద నుంచి రూ.4.10 లక్షల నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచ క్రికెట్ పోటీల్లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌పై నగర శివార్లలో జోరుగా బెట్టింగ్‌లు జరిగాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) అదనపు డీసీపీ ఈ.రాంచంద్రారెడ్డి తన బృందాలను అప్రమత్తం చేశారు. ఈస్ట్‌జోన్ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు ఉమేందర్, పుష్పన్‌కుమార్, ఎస్‌ఐలు రాములు, ఆంజనేయులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కేంద్రాలపై దాడులు చేశారు.
ఎల్బీనగర్‌లో...
నాగోలు రాఘవేంద్రకాలనీ నివాసి రాంరెడ్డి వెంకట్రాంరెడ్డి (47) షేర్ మార్కెట్‌లో పని చేస్తున్నాడు. ఇతను ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రూ.21 వేలు, కంప్యూటర్, నాలుగు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ను స్వాధీనం చేసుకుని వెంకట్రాంరెడ్డిని రిమాండ్‌కు తరలించారు.
రాజేంద్రనగర్‌లో...
రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని పాండురంగానగర్ నివాసి సాయి ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులతో పాటు రాజేంద్రనగర్ ఎస్‌ఐ కనకయ్య దాడి చేశారు. బుకీ తివారీతో పాటు బెట్టింగ్‌రాయుడు హరీష్ తదితరులను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.18,400 స్వాధీనం చేసుకున్నారు.
మియాపూర్...
మియాపూర్ ఠాణా పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా మోహన్‌లాల్ అనే బుకీతో పాటు బెట్టింగ్ రాయుళ్లను ఎస్‌ఓటీ పోలీసులు పట్టున్నారు. నిందితుల నుంచి రూ.3.70 లక్షలతో పాటు టీవీ, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.
మరో ఏడుగురి పట్టివేత...
చాంద్రాయణగుట్ట: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్టు నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. డీసీపీ కథనం ప్రకారం... చార్మినార్, బహదూర్‌పురా, మలక్‌పేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో చేలాపురాకు చెందిన పంకజ్ కుమార్ అగర్వాల్, కిషన్‌బాగ్‌కు చెందిన గులాం ఫరీద్, షేక్ హసన్, మహ్మద్ అస్లాం, మహ్మద్ హుస్సేన్, కొత్తపేటకు చెందిన జి.శ్రీకాంత్, వనస్థలిపురానికి చెందిన బి.రాజశేఖర్ , మిర్యాలగూడకు చెందిన రాజులు గ్రూప్‌లుగా ఏర్పడి లైవ్ క్రికెట్ సమయంలో ఫోన్లలో పంటర్లతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దక్షిణ, తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు ఠాకూర్ సుఖుదేవ్ సింగ్, సి.హెచ్.శ్రీధర్, ఎస్సైలు ఎ.సుధాకర్, శేఖర్ రెడ్డి, రవికుమార్, మల్లేష్, వెంకటేశ్వర్లు, గౌస్ దాడులు చేసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, 4 సెల్‌ఫోన్లు, కలర్ టీవీ మొదలైనవి స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలపై దాడులు
Published Fri, Mar 27 2015 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM
Advertisement
Advertisement