ఎన్‌ఆర్‌ఐకీ కరెన్సీ ‘కాటు’
- మలేసియా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ
- తిరిగి వెళ్ళే ప్రయత్నాల్లో ఏటీఎంకు వెళ్తూ ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఎన్‌ఆర్‌ఐ.. చాలాకాలం తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చారు. పెద్ద నోట్ల రద్దు ఆయనను ఆస్పత్రిపాలు చేసింది. ఏటీఎం కేంద్రానికి వెళ్ళే తొందరలో హోటల్ మెట్లపై నుంచి పడి ఆస్పత్రిలో చేరారు. నగరానికి చెందిన సెపెరుమనియం కన్వాగి(70) కుటుంబంతో సహా కొన్నేళ్ల క్రితం మలేíసియాలో స్థిరపడ్డారు. నగరంలో ఉన్న స్నేహితుల్ని కలవడానికి తరచూ ఇక్కడికి వచ్చిపోతుండేవారు. గత గురువారం సిటీకి చేరుకున్న ఆయన సన్నిహితుల్ని కలవడంతో పాటు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, సోమవారం తిరిగి వెళ్ళిపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సిటీకి చేరుకున్న ఆయన లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో బస చేసినప్పటి నుంచి కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. ‘వర్దా’ ప్రభావంతో తిరుపతి ప్రయాణం రద్దు చేసుకున్నారు.
చేతిలో ఉన్న డబ్బు అయి పోతుండటం, అన్ని చోట్లా క్యాష్‌లెస్ లావాలేవీలు సాధ్యం కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిటీలో ఉన్న ఓ స్నేహితుడు తన ఏటీఎం కార్డు ఇచ్చాడు. సోమవారం తిరిగి వెళ్ళిపోవాల్సి ఉండటం, ఖర్చులకు చేతిలో డబ్బు లేకపోవడంతో నగదు ఉన్న ఏటీఎం కేంద్రం కోసం ఆరా తీశారు. సమీపంలోని ఓ ఏటీఎంకి వెళ్లే ప్రయత్నంలో హడావుడిగా హోటల్ మెట్లపై నుంచి జారి పడ్డారు. అంబులెన్స్‌లో సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, కాళ్ళతో పాటు తుంటి భాగానికీ తీవ్రగాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటే తప్ప పూర్తిగా నడవలేరని తేలడంతో కన్వాగి ప్రస్తుతం హాస్పటల్ బెడ్‌కి పరిమితమయ్యారు.