
సైబరాబాద్.. ఇక ఈస్ట్, వెస్ట్
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను ప్రభుత్వం రెండుగా విభజించింది. సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్ కమిషనరేట్‌లుగా ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
విభజన ప్రక్రియ పూర్తి
ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను ప్రభుత్వం రెండుగా విభజించింది. సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్ కమిషనరేట్‌లుగా ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రెండు నెలల పాటు సైబరాబాద్ కమిషనరేట్ విభజనపై కసరత్తు చేసిన పోలీసు ఉన్నతాధికారులు పలు దఫాలుగా పంపిన ప్రతిపాదనల్లో మార్పులు తీసుకొచ్చాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. జనాభా పెరుగుదల, నేరాల విస్తృతి కారణంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిని పెంచుతూ రెండుగా విభజించింది. సైబరాబాద్ ప్రస్తుతం దాదాపు 3,500 చదరపు కి.మీ. మేర విస్తరించి ఉంది. దీనికి అదనంగా రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలను ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి తీసుకొచ్చింది. మొత్తంగా హెచ్‌ఎండీఏ ప్రాంతమంతా సైబరాబాద్ పరిధిలోనే ఉండనుంది. ప్రస్తుతం రెండు కమిషనరేట్ల పరిధి విస్తీర్ణం 5 వేల కి.మీ. మేరకు చేరుకోనుంది. రెండు కమిషనరేట్లకు కూడా మెజిస్ట్రేట్ అధికారం లభించనుంది.
అదనపు సిబ్బంది మంజూరు: ఇప్పటికే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధికి సరిపడా సిబ్బంది లేరనే విషయాన్ని ప్రస్తుత పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కడెక్కడ సిబ్బంది అవసరమనే విషయాన్ని అంకెలతో సహా వివరించారు. దీనికితోడు తాజా నిర్ణయ నేపథ్యంలో అదనపు సిబ్బంది అనివార్యమని డీజీపీ అనురాగ్‌శర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండు కమిషనరేట్లుగా విభజించడమే కాకుండా రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని ఠాణాలను వీటి పరిధిలోకి తీసుకురావడం కూడా అదనపు సిబ్బంది పెంపునకు మరో కారణంగా చూపారు. దీంతో 346 పోలీసు పోస్టులు, 135 మినిస్టిరీయల్ స్టాఫ్, 2,000 హోంగార్డ్స్, 41 ఔట్ సోర్సింగ్ పోస్టులకు
ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
త్వరలో కమిషనర్ల నియామకం: కొత్తగా ఏర్పడుతున్న రెండు కమిషనరేట్లకు ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో కమిషనర్లను నియమించనుంది. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం విభజన కూడా కొత్త కమిషనర్లు వచ్చిన తర్వాతనే అమల్లోకి రానుంది. కమిషనర్లుగా ఐజీ స్థాయి ర్యాంకు గల అధికారులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జోన్లకు ఎస్పీ స్థాయి అధికారి డీసీపీ హోదాలో, డివిజన్‌కు డీఎస్పీ స్థాయి అధికారి ఏసీపీ హోదాలో నేతృత్వం వహిస్తారు. అయితే సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌కు సంబంధించి ప్రధాన కార్యాలయం విషయంలో సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతమున్న సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం వెస్ట్ పరిధిలోకి వెళ్తోంది. ఈస్ట్ సైబరాబాద్‌కు కొత్త భవనం మాత్రం ఉప్పల్ ప్రాంతంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈస్ట్ సైబరాబాద్ కార్యాలయాన్ని కొంత కాలం పాటు అద్దె భవనంలో కొనసాగించడమా? లేక ప్రస్తుతం ఉన్న కార్యాలయంలో కొనసాగించాలా? అనే విషయంలో స్పష్టత లేదు.
సైబరాబాద్ విభజన స్వరూపమిది...
ఈస్ట్ కమిషనరేట్...
భువనగిరి జోన్: భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లు
మల్కాజిగిరి జోన్: మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు
ఎల్‌బీనగర్ జోన్: ఎల్‌బీనగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం డివిజన్లు
సీసీఎస్‌లు: భువనగిరి, మల్కాజిగిరి, ఎల్బీనగర్
మహిళా పోలీసు స్టేషన్: సరూర్‌నగర్
వెస్ట్ కమిషనరేట్...
శంషాబాద్ జోన్: శంషాబాద్, రాజేంద్రనగర్, షాద్‌నగర్ డివిజన్లు
మాదాపూర్ జోన్: మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్ డివిజన్లు
బాలానగర్ జోన్: పేట్ బషీరాబాద్, బాలానగర్ డివిజన్లు
సీసీఎస్‌లు: బాలానగర్, మాదాపూర్, శంషాబాద్
మహిళా పోలీసు స్టేషన్: ఐటీ కారిడార్