
టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది: షబ్బీర్ అలీ
కాంగ్రెస్ నేతలతో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మండిపడ్డారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలతో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. దానం నాగేందర్ తమ పార్టీలో చేరుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు ఓ పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ఓడినంత మాత్రాన కాంగ్రెస్ డీలా పడదని షబ్బీర్ అన్నారు. రాజకీయంగా లబ్ది కోసమే టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా దానం నాగేందర్ కారు ఎక్కేందుకు సిద్ధమై చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానం సోమవారం ఉదయం షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. సుమారు అరగంటపాటు వీరి భేటీ జరిగింది.
పొమ్మనలేక పొగ పెట్టారు
అంతకు ముందు దానం నాగేందర్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీలో కొందరు నేతలు పొమ్మనలేక పొగ పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చూశారని, తనను తక్కువ చేయడం ..తన అనుచరులను బాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని, ఇక నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి పని చేస్తానని దానం తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కసరత్తు కోసం రేపట్నుంచి గాంధీభవన్లో సమావేశాలు జరుగుతాయన్నారు. ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తామన్నారు.