
మేఘాల రథంపై గగనయానం
ఇక మేఘ సందేశం వినిపించదు..
శివరంజని కనిపించదు..
బొబ్బిలిపులి గాండ్రించదు..
గోరింటాకు పండదు..
దర్శకరత్న ఆకాశ మార్గాన
అనంత తీరాలకు తరలిపోయారు
- అస్వస్థతతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన దర్శకరత్న
- జనవరిలో అన్నవాహికకు సర్జరీ చేసిన వైద్యులు
- మంగళవారం మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
- కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్లు ప్రకటించిన వైద్యులు
- పెద్దదిక్కును కోల్పోయిన సినీ పరిశ్రమ
- కష్టాల కడలి నుంచి కళామతల్లి గర్వించే స్థాయికి ఎదిగిన దాసరి
- 151 సినిమాలకు దర్శకత్వం.. నిర్మాతగా 53, రచయితగా
- 250 చిత్రాలు.. కేంద్రమంత్రిగా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర
- సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి
- నేడు మొయినాబాద్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
సాక్షి, అమరావతి/హైదరాబాద్
బహుముఖ ప్రజ్ఞాశాలి, మహా దర్శకుడు, నటుడు, రచయిత, ప్రయోక్త, సామాజిక ఉద్యమకారుడు, పత్రికాధిపతి దాసరి నారాయణ రావు (72) కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో శాశ్వత నిద్రలోకి వెళ్లారు. చికిత్స సమయంలో అకస్మాత్తుగా గుండె పని చేయకపోవడం (కార్డియాక్ అరెస్ట్)తో ఆయన మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తోల్‌కట్ట వద్ద ఉన్న దాసరి ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలు కూడా ఇదే ఫాంహౌస్‌లో నిర్వహించారు. దాసరి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సినీరంగ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
జనవరి నుంచే అస్వస్థత..
ఈ ఏడాది జనవరి 19న దాసరి నారాయణరావు అస్వస్థతకు గురికావడంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అన్నవాహిక, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్సలు చేశారు. అన్నవాహికకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో ట్యూబ్, మెటల్‌స్టంట్ వేశారు. మూత్రపిండాలలో కూడా సమస్య ఏర్పడడంతో డయాలసిస్ చేశారు. ఈ చికిత్స తర్వాత దాసరి కోలుకుని మార్చి 29న ఇంటికి వెళ్లారు. అయితే మళ్లీ ఇన్‌ఫెక్షన్ సోకటంతో మే 17న తిరిగి కిమ్స్‌లో చేరారు. వైద్యులు అన్నవాహికకు రీసర్జరీ చేసి కోలుకున్నాక డిశ్చార్జి చేశారు.
మంగళవారం ఉదయం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబీకులు కిమ్స్‌కు తెచ్చారు. చికిత్స అందిస్తుండగానే రాత్రి 7 గంటల సమయంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని వైద్యుల కన్నా ముందే ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఆస్పత్రి ముందు ప్రకటించారు. ‘‘గురువు గారు ఇక లేరు.. కాసేపట్లో బాడీని ఇంటికి తీసుకెళ్తున్నాం..’’అని కన్నీటి పర్యంతమై చెప్పడంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆస్పత్రికి తరలి వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
తరలివచ్చిన ప్రముఖులు
దాసరి మరణ వార్త తెలియడంతో అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు ఆయన అభిమానులు పెద్దఎత్తున ఆస్పత్రికి తరలి వచ్చారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుతెచ్చుకొని కంటతడి పెట్టుకున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, మాజీ సీఎం రోశయ్య, సినీ నటులు మోహన్‌బాబు, మంచు విష్ణు, ఆర్.నారాయణమూర్తి, రాజారామ్‌రెడ్డి తదితరులు దాసరి భౌతికకాయానికి నివాళులర్పించారు. తెలుగు సినిమా పరిశ్రమకు దాసరి దేవుడిలాంటివాడని తలసాని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైద్రాబాద్‌కు రావడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారన్నారు. చిత్ర పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపించి.. న్యాయం చేశారన్నారు. మోహన్‌బాబు దుఃఖాన్ని ఆపుకోలేక మీడియా ముందు బోరుమన్నారు. దాసరి తనకు సినిమాల్లో జన్మను ప్రసాదించిన తండ్రి లాంటివాడని పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ కీర్తిప్రతిష్టతలను దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసిన గొప్ప మహానుభావుడన్నారు.
నివాసం వద్ద విషాదఛాయలు
దాసరి మరణంతో నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నం.46లోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మంగళవారం ఉదయం నుంచే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇంటిల్లిపాది విలవిల్లాడిపోయారు. సాయంత్రం మరణ వార్త తెలియగానే కుప్పకూలారు. దాసరి నివాసానికి ఎదురుగా ఉన్న మస్తాన్‌నగర్ వాసులకు గత రెండు దశాబ్దాలుగా ఆయన సుపరిచితులు. దాసరి మరణ వార్త విని స్థానికులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. దాసరి కొడుకు అరుణ్‌కుమార్ నివసించే జూబ్లీహిల్స్ రోడ్ నం.72లోనూ విషాదం నెలకొంది. ఎక్కడ చూసినా దాసరి లేరన్న వార్తను తట్టుకోలేక విలపిస్తున్న కుటుంబీకులు, బంధు మిత్రులు కనిపించారు.
బాల్యమంతా కష్టాలమయం..
1945 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సాయిరాజు, మహాలక్ష్మీ దంపతులకు దాసరి జన్మించారు. ఆయన బాల్యం వడ్డించిన విస్తరికాదు. కష్టం తప్ప సుఖం తెలియని పసితనంలోనే కాయకష్టం చేసి పొట్టపోసుకున్నారు. వడ్రంగి మొదలు సైకిల్ మెకానిక్ వరకు అన్ని పనులు చేశారు. దాసరి తండ్రి పొగాకు వ్యాపారి. ఆరుగురు సంతానంలో దాసరి మూడోవారు. పాలకొల్లు ఎంఎంకేఎన్‌ఎం హైస్కూల్‌లో దాసరి 6వ తరగతి చదువుతున్న సమయంలో వారి కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. గోదాములోని పొగాకు కాలిపోవడంతో ఆర్థిక పరిస్థితి తిరగబడింది. నాడు స్కూలు ఫీజు మూడు రూపాయల పావలా కట్టడానికి కూడా డబ్బుల్లేక వడ్రంగి దుకాణంలో నెలకు ఒక రూపాయికి పనికి కుదిరారు.
దాసరి కష్టాలకు కరిగిన ఓ మాస్టారు స్కూలు ఫీజు కట్టి చదివించినా తిండికి పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. చివరకు చందాలతో చదువుకున్నానని సాక్షాత్తు దాసరే స్వయంగా చెప్పుకున్నారు. ఈ కష్టాల మధ్యే ఆయన డిగ్రీ వరకు చదువుకున్నారు. వాస్తవానికి దాసరి పుట్టింది 1945లో. అయితే ఆయన బర్త్ సర్టిఫికెట్‌లో మాత్రం 1947గా ఉంది. ఇటీవల ఓ సందర్భంలో సాక్షితో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని దాసరి స్వయంగా చెప్పారు. రాజ్యసభకు ఇచ్చిన డిక్లరేషన్‌లోనూ ఆయన 1947గానే పేర్కొన్నారు. అయితే వికీపీడియాలో మాత్రం 1942గా ఉంది.
స్వగ్రామం పాలకొల్లులోని దాసరి నివాసం
కళామతల్లి ఒడిలోకి..
హైస్కూల్ స్థాయిలోనే నాటక రంగంపై మక్కువ పెంచుకున్న దాసరి.. నటుడిగా, రచయితగా, ప్రయోక్తగా, దర్శకుడిగా ఎదిగారు. అవార్డులు, రివార్డులకు మారు పేరయ్యారు. నాటక రంగ అనుభవంతో సినీరంగ ప్రవేశం చేసి ఒక్క ఛాన్స్ కోసం చెప్పులరిగేలా తిరిగారు. తాతా–మనవడు చిత్రంతో పల్లె జనం హృదయాలను కదిలించారు. దర్శకత్వంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి అపార ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రనటుల జీవితాలను సైతం మలుపు తిప్పే చిత్రాలను నిర్మించారు. జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌ను రాజకీయం వైపు మరల్చడానికి దాసరి తీసిన చిత్రాలే ప్రేరణ అని చెబుతారు. ఎన్టీఆర్ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 151 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కారు.
శివరంజని, ప్రేమాభిషేకం, మేఘసందేశం, గోరింటాకు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, ఒసేయ్ రాములమ్మ తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన తాతా–మనవడు చిత్రం ఏకంగా 350 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. తర్వాత సంసారం సాగరం, బంట్రోతు భార్య, స్వర్గం–నరకం.. ఇలా హిట్ల మీద హిట్లు సాధించారు. దర్శకుడిగా ఆయన ఆఖరు చిత్రం ఎర్రబస్సు(151వ చిత్రం). 2010లో ఆయన దర్శకత్వం వహించిన 149 సినిమా యంగ్ ఇండియాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితమిచ్చారు. బాలకృష్ణ హీరోగా 150వ చిత్రం పరమ వీర చక్ర తీశారు.
రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర..
దాసరి ఏ రంగంలో అడుగుపెట్టినా ఓ సంచలనమే. సినీ రంగంలో అపార ఖ్యాతిని ఆర్జించిన దాసరిలో ఓ రాజకీయ సంస్కరణ వాది, సామాజిక ఉద్యమకారుడు కూడా ఉన్నారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన తీవ్రంగా యోచించారు. అందులో భాగంగానే ఒసేయ్ రాములమ్మ సినిమా తీశారంటారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని దాసరి భావించారు. ఇందుకు పలువురు వామపక్ష మేధావులతో మంతనాలు జరిపారు. సీపీఎం నుంచి బయటకు వచ్చిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నరసింహారెడ్డితో కలసి సామాజిక ఉద్యమ వేదికను ఏర్పాటు చేశారు.
నాడు నల్లగొండ జిల్లా సూర్యాపేటలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. అయితే అనివార్యకారణాలతో ఆ వేదిక ముందుకు సాగలేదు. ఆ తర్వాత 1996లో తెలుగు తల్లి పార్టీని ఏర్పాటు చేద్దామనుకున్నా కార్యరూపం దాల్చలేదు. చివరికి కాంగ్రెస్ మద్దతుదారుగా మారి ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 1999లలో ఆ పార్టీలో చేరారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 2000 ఏప్రిల్‌లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. 2004 నుంచి 2008 వరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన కొన్ని ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేశారు.
కాపు ఉద్యమంలో కీలకపాత్ర...
సినిమా, రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేకత చాటుకున్న దాసరి నారాయణరావు ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న కాపు ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో అన్ని పార్టీ నేతలను ఒకతాటిపైకి తీసుకొచ్చారు. ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేసి రాజమండ్రి ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులను అభ్యంతరకరమైన మాటలతో దూషించిన సమయంలో దాసరి దీటుగా స్పందించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు, భవిష్యత్ కార్యచరణ రచించడం కోసం గతేడాది అక్టోబర్ 4 తన స్వగృహంలోనే కాపు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. చివరికి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న తన చిరకాల కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు.
చైనా నుంచి వస్తున్న చిరంజీవి?
కుటుంబ సభ్యులతో కలసి విహారయాత్రలకు వెళ్లిన చిరంజీవి, దాసరి నారాయణరావు మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దాసరిని కడసారి చూసి, అంత్యక్రియల్లో పాల్గొనడానికి చైనా పర్యటను అర్ధంతరంగా ముగించుకొని ఆయన తిరిగి వస్తున్నట్లు సమాచారం.
నేడు సినీ పరిశ్రమ, థియేటర్లు బంద్
దాసరి మరణానికి సంతాప సూచకంగా బుధవారం తెలుగు రాష్ట్రాల్లో చలన చిత్ర పరిశ్రమ, థియేటర్లను ఒకరోజు పాటు బంద్ చేయనున్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ సంతాప సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.
భార్య పద్మతో దాసరి నారాయణరావు
అవార్డులు రివార్డులు..
సినీ పరిశ్రమ: దర్శకుడిగా 151 చిత్రాలు, నిర్మాతగా 53 , రైటర్‌గా 250
పురస్కారాలు: పద్మశ్రీ, కళాప్రపూర్ణ, దర్శకరత్న, అత్యధిక చిత్రాల దర్మకుడిగా
గిన్నిస్ రికార్డు, రెండు జాతీయ చలనచిత్ర
పురస్కారాలు, 9 నంది అవార్డులు, 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
జర్నలిజం: ఉదయం దినపత్రిక, శివరంజని, మేఘసందేశం సినీపత్రికలు
బొబ్బిలి పులి రాజకీయ వారపత్రిక
రాజకీయాల్లోకి: 1999లో కాంగ్రెస్‌లోకి రాజకీయ రంగ ప్రవేశం
2000లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక,
2004లో కేంద్రమంత్రిగా ప్రమాణం