దారికాచిన మృత్యువు | Death knocks the door | Sakshi
Sakshi News home page

దారికాచిన మృత్యువు

Published Thu, Sep 1 2016 1:50 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

దారికాచిన మృత్యువు - Sakshi

దారికాచిన మృత్యువు

వారందరూ స్నేహితులు.. ఎంతో ఉత్సాహంగా పెళ్లి విందుకు బయల్దేరారు.. కొద్దిసేపట్లో విందులో సంతోషంగా గడపాల్సిన వారిని రోడ్డుపైనే మృత్యువు కబళిం చింది!

ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం.. 8 మంది యువకుల దుర్మరణం
- పెళ్లి విందుకు వెళ్తుండగా అర్ధరాత్రి మేడ్చల్ టోల్‌గేట్ వద్ద ఘటన
- టవేరాను వెనుక నుంచి ఢీకొన్న డీసీఎం
- ముందున్న లారీ-డీసీఎం మధ్య నుజ్జునుజ్జయిన టవేరా
- డోర్ తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డ ఓ యువకుడు
- మృతులంతా మెదక్ జిల్లా సదాశివపేటకు చెందినవారే
 
 మేడ్చల్/సదాశివపేట/హైదరాబాద్: వారందరూ స్నేహితులు.. ఎంతో ఉత్సాహంగా పెళ్లి విందుకు బయల్దేరారు.. కొద్దిసేపట్లో విందులో సంతోషంగా గడపాల్సిన వారిని రోడ్డుపైనే మృత్యువు కబళిం చింది! వీరు ప్రయాణిస్తున్న టవేరా వాహనం లారీ, డీసీఎం మధ్య నలిగి నుజ్జునుజ్జయింది. ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు!! మంగళవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం సుతారిగూడ ఔటర్‌రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన వాహనదారుడి నిర్లక్ష్యానికి యువకుల నిండు జీవితాలు బలయ్యారుు.

 ఘోరం ఎలా జరిగింది?
 ఆదివారం మెదక్ జిల్లా మునిపల్లి మండలం భూసారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ముస్తఫా కూతురుతో మేడ్చల్‌కు చెందిన అమీనుద్దీన్‌కు వివాహం జరిగింది. మంగళవారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని కొంపల్లిలో వివాహ విందు ఏర్పాటు చేశారు. దీనికి హాజరయ్యేందుకు పెళ్లి కూతురు అన్న ఇర్ఫాన్  (21), అతడి స్నేహితులు మహ్మద్ అఖిల్(21), మహ్మద్ నిషార్(22), మహ్మద్ ఫెరోజ్(22), మహ్మద్ ఇంగ్రోజ్(25), సమీర్( 21), అక్బర్(22), మహ్మద్ అబ్బాస్(22) టాటా టవేరా వాహనంలో సదాశివపేట నుంచి మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో బయల్దేరారు.

రాత్రి 11 గంటల సమయంలో మేడ్చల్ టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. డబ్బులు చెల్లించేందుకు డ్రైవర్ సకారాత్(38) టవేరా వాహనాన్ని నిలిపాడు. వీరి వాహనం ముందు టోల్ రుసుం చెల్లించేందుకు ఓ లారీ (వీవీఆర్ ట్రాన్ ్సపోర్ట్) ఆగి ఉంది. ఇంతలో వెనుక నుంచి ఓ డీసీఎం మృత్యువులా దూసుకొచ్చి అతి వేగంతో టవేరాను ఢీకొంది. ముందున్న లారీ, డీసీఎం మధ్యలో ఇరుక్కుని టవేరా నుజ్జునుజ్జరుుం ది. దీంతో అందులోని డ్రైవర్ సకారత్ సహా 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డ్రైవర్ పక్కనే కూర్చున్న అబ్బాస్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వెనుక నుంచి వాహనాన్ని డీసీఎం ఢీకొట్టగా ముందున్న డోర్ తెరుచుకుంది. దీంతో అబ్బాస్ అందులోంచి ఎగిరి బయట పడ్డాడు. ప్రస్తు తం ఈయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టవేరాలోంచి మృతదేహాలను క్రేన్  సాయంతో అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాద సమయంలో వర్షం కూడా రావడంతో మృతదేహాలను బయటికి తీస్తుండగా రక్తం ఏరులై పారింది. మృతులంతా వేర్వేరు కుటుంబాలకు చెందినవారు. వీరంతా ‘ఫేమస్ క్రికెట్ టీమ్’ సభ్యులు. ముగ్గురు బీటెక్ చదువుతున్నారు.

 అయ్యో... అంతా ఎదిగొచ్చినవారే..!
 ఎదిగొచ్చిన కొడుకులు మృత్యుపాలవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. వారి కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ఆవరణలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రిలో మంత్రి హరీశ్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన మహ్మద్ అఖిల్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. తండ్రి అబ్బాస్ అహ్మద్ లారీ డ్రైవర్. ఈయనకు నలుగురు కుమారులున్నారు. వారిలో చివరివాడైన అఖిల్.. సోదరుడు నడుపుతున్న పాన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. డ్రైవర్ సకారత్ తన సొంత టవేరా వాహనం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఈయనకు భార్య మేరజ్, ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. మహమ్మద్ నిషాద్ నిజాం కాలేజీలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈయన తండ్రి హైమద్ సిద్దాపూర్ గౌని వద్ద హార్డ్‌వేర్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఫెరోజ్ తండ్రి షబ్బీర్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఫెరోజ్ రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంగ్రోజ్ తండ్రి అన్వర్ లారీ యజమాని. ఇంగ్రోజ్ ఇంటర్ వరకు చదివి పనిలో తండ్రికి సాయంగా ఉంటున్నాడు. సమీర్ పదో తరగతి వరకు చదువుకొని తండ్రి సలీమ్‌తో కలసి హౌస్ వైరింగ్ పనులు చేస్తున్నాడు. ఇర్ఫాన్ హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నాడు. మహ్మద్ అక్బర్ పదో తరగతి చదివాడు. ప్లంబింగ్ పనులు చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈయన తండ్రి సదాశివపేటలో తోపుడు బండిపై అరటిపండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.

 సీఎం దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల పరిహారం
 ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 టోల్‌గేట్ నిర్వాహకులపై కేసు
 ఎలాంటి విద్యుత్ లైట్లు, హెచ్చరిక బోర్డులు లేకుండా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ యువకుల మృతికి కారకులైన టోల్‌గేట్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ అన్నారు. టవేరాను వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఘటనా స్థలానికి వెళ్లి ఆయన ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement