ప్రతికాత్మక చిత్రం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. మే 24–జూన్ 24 మధ్య కేవలం నాలుగు వారాల్లోనే రాష్ట్రంలో 138 మంది రోడ్లకు బలయ్యారు. తాజాగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో ట్రాక్టర్ పడి 15 మంది కూలీలు మృతి చెందారు. గతనెల 26న రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో 11 మంది చనిపోగా, 20 మంది గాయపడ్డారు. అంతకు ముందు రోజు అంటే మే 25న నిజామాబాద్ జిల్లాలో నాగ్‌పూర్–బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 29న వరంగల్–కరీంనగర్ రహదారిపై ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో 8 మంది ప్రాణాలు చనిపోగా, 15 మంది గాయాలపాలయ్యారు. సురక్షితమని చెప్పుకునే వోల్వో బస్సులు కూడా ఇటీవల ప్రమాదాల బారిన పడుతున్నాయి. గడచిన ఆరు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో వివిధ మార్గాల్లో ప్రయాణించే 13 వోల్వో బస్సులు ప్రమాదానికి గురై నలుగురు చనిపోయారు. రహదారులను ఆధునీకరిస్తున్నా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయన్న కారణాలను విశ్లేషిస్తే దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
డ్రైవర్లకు నైపుణ్యం ఏదీ?
రాష్ట్రంలో వాహనాల సంఖ్య ఏటా రెండింతలు పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా నైపుణ్యం గల డ్రైవర్లు లభించడం లేదు. ట్రాక్టర్, లారీ, బస్సు, కారు.. ఇలా ఏదైనా సరే నడపొస్తే చాలు చేతికి స్టీరింగ్ ఇచ్చేస్తున్నారు. లైసెన్స్ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. బండి నడపొస్తే చాలు ట్రాక్టర్, కారు డ్రైవర్‌గా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ట్రాఫిక్ నిబంధనల గురించి కనీస అవగాహన లేకుండా నడుపుతుండటమే ప్రమాదాలకు కారణమని రోడ్డు భద్రతా చైర్మన్‌గా పనిచేసిన ఎ.కె.మహంతి గతంలో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో అందులో సూచించారు. జాతీయ రహదారుల డిజైన్‌లో లోపాలను ఎత్తిచూపడంతోపాటు ఎక్కడెక్కడ వాటిని సవరించాలో కూడా సిఫారసు చేశారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నా ఆ నివేదికను ఎవరూ పట్టించుకోవడం లేదు.
నిధుల లేమి.. సిబ్బంది కొరత
రోడ్డు భద్రత విభాగానికి నిధుల కేటాయింపు బాగా తగ్గించారు. ఈ విభాగంలో తగిన సిబ్బంది లేరు. కొత్తగా ఎవరినీ నియమించడం లేదు. రోడ్డు భద్రతా సంస్థకు ఇదివరకు చైర్మన్లుగా పని చేసినవారు ప్రమాదాల నివారణకు చేసిన సూచనలు, సిఫారసులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎ.కె.మహంతి చైర్మన్‌గా ఉన్న సమయంల రూపొందించిన నివేదికను ఇలాగే బుట్టదాఖలు చేశారు. ఇక ట్రాఫిక్ నిబంధనలపై కనీస అవగాహన లేని వారు తేలిగ్గా లైసెన్స్‌లు పొందుతున్నా రవాణా శాఖ చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్లకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలన్న అంశాన్ని గాలికొదిలేసింది. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లను కూడా రహదారుల్లో కలిపేస్తుండటంతో పాదచారులు రోడ్లపైనే నడవాల్సి వస్తోంది. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాజధానిలో కొత్తకొత్త వాహనాలు రోడ్డెక్కుతుండటం, పరిమితికి మించిన వేగంతో వెళ్తుండడంతో ప్రతినిత్యం సగటున 20 మంది గాయాలపాలవుతున్నారు.
కోట్లలో టోల్.. భద్రత నిల్
ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్వహణను చేపడుతూ ఉండటంతో టోల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి 40–50 కి.మీ.కు కనీసం రూ.65 నుంచి గరిష్టంగా రూ.140 దాకా వాహనాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. ఇలా కోట్లలో సొమ్ము రాబడుతున్నా జాతీయ, రాష్ట్ర రహదారుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. రోడ్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల రాష్ట్ర రహదారులు.. జిల్లా రహదారుల కంటే ఘోరంగా మారాయి. టోల్ వసూలుకు ఇస్తున్న ప్రాధాన్యం రోడ్డు భద్రతా చర్యలకు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిలో ప్రయాణిస్తే అడుగడుగునా ప్రమాదకరమైన మలుపులే ఉన్నాయి. నాలుగు రోడ్లుగా నిర్మించే సమయంలో హైదరాబాద్– విజయవాడ రహదారిలో ప్రమాదకరమైన మలుపులు ఉన్నా పట్టించుకోలేదు. సూర్యాపేట జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి, నకిరేకల్ మండలం ఇనుపాముల వద్ద ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఈ రెండుచోట్ల ఏడాది కాలంలోనే ప్రమాదాల్లో దాదాపు వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment