హైదరాబాదీ బిర్యానీ.. ఆంధ్రా గోంగూర | Delicious food in trains | Sakshi
Sakshi News home page

హైదరాబాదీ బిర్యానీ.. ఆంధ్రా గోంగూర

Published Wed, Jun 28 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

హైదరాబాదీ బిర్యానీ.. ఆంధ్రా గోంగూర

హైదరాబాదీ బిర్యానీ.. ఆంధ్రా గోంగూర

- రైళ్లలో రుచికరమైన ఆహారం
నాణ్యతా ప్రమాణాలు పాటించేలా సరికొత్త పాలసీకి రైల్వే కసరత్తు 
 
సాక్షి, హైదరాబాద్‌: హజ్రత్‌ నిజాముద్దీన్‌ నుంచి బెంగళూరుకు వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆగింది. అప్పటికే ఆగ్రహంగా ఉన్న అందులోని ప్రయాణికులు... రుచీపచీ లేని పులి సిపోయిన ఆహార పదార్థాలు ఇచ్చారంటూ స్టేషన్‌లో నిరసనకు దిగారు. ముందు రోజూ ఇలాగే నాణ్యతలేని ఆహారం అందించారని ఆందోళన చేశారు. దీంతో చాలాసేపు రైలు స్టేషన్‌లోనే నిలిచిపోయింది. పరుగెత్తుకొచ్చిన అధికారులు రాబోయే స్టేషన్‌లో తాజా పదార్థాలు అందిస్తామని చెప్పి, ఫిర్యాదులు తీసుకున్నారు. 
 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సుమారు 200 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో నిత్యం ఎక్కడో అక్కడ ఆహార పదార్థాల నాణ్యత, రుచిపై ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో ఫిర్యాదులు రాకుం డా దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు కోరుకున్న నాణ్యమైన, రుచికరమైన ఆహార పదా ర్థాలను అందజేసేందుకు సమగ్ర కేటరింగ్‌ పాలసీని అమల్లోకి తెచ్చేలా సన్నాహాలు చేస్తోంది. స్థానిక వంట కాలను రుచికరంగా అందించేలా రూపొందిస్తోంది. 
 
నాణ్యతపై దృష్టి... 
ప్రస్తుతం రైళ్లలో ఆహార సరఫరా నిర్వహణపై సమగ్రమైన విధానం లేదు. రాజధాని, దురంతో రైళ్లలో ఆహార పదార్థాలను ఐఆర్‌సీటీసీ అందజేస్తుండగా... మిగిలిన వాటిలో రైల్వే కాంట్రాక్టు కేటరింగ్‌ సంస్థలు సరఫరా చేస్తున్నాయి. దీంతో కొన్ని సంస్థలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. మెనూలో సూచించిన ఆహార పదార్థాల పరిమాణం, నాణ్యతలో అనేక తేడాలు ఉంటున్నాయి. ఉదాహరణకు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌తో పాటే ఫుడ్‌ కూడా బుక్‌ చేసుకున్న ప్రయాణికుడికి వెల్‌కమ్‌ డ్రింక్, కాఫీ/టీ, సమోసా, వెజ్‌ శాండ్‌విచ్, బిస్కెట్‌ల వంటివి ఇవ్వాలి. మధ్యాహ్నం, రాత్రి భోజన సమయంలో వెజిటబుల్‌ సూప్, వెన్న, 100 గ్రాముల చపాతీ, 100 గ్రాముల రైస్, 150 గ్రాముల పప్పు, చికెన్, పన్నీర్, క్యాప్సికమ్‌ కర్రీస్‌ వంటివి వడ్డించాలి.

వీటితో పాటు స్వీట్, ఐస్‌క్రీమ్‌లు, వాటర్‌ బాటిళ్లు కూడా ఇవ్వాలి. కానీ కొన్ని కేటరింగ్‌ సంస్థలు ఈ ఐటెమ్స్‌ అన్నీ ఇవ్వడంలేదు. నాణ్యతతో పాటు పరిమాణాల్లోనూ తేడాలుంటున్నాయి. ఆహార పదార్థాల తయారీ, పంపిణీ ఒకే సంస్థకు కట్టబెట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆహార తయారీ, పంపిణీని వేరు వేరు సంస్థలకు అప్పగించడంవల్ల నాణ్యత, రుచి, శుచిపై నిఘా ఉంటుందని భావిస్తున్నారు. 
 
‘రాజధాని’ సంఘటనపై దర్యాఫ్తు... 
ఇటీవల హజ్రత్‌ నిజాముద్దీన్‌–బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులు ఆహార పదార్థాల నాణ్యతపై చేసిన ఫిర్యాదులను దక్షిణ మధ్య రైల్వే సీరియస్‌గా తీసుకుంది. వీటిపై ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. జీఎం వినోద్‌కుమార్‌యాదవ్‌ ఈ అంశంపై ఐఆర్‌సీటీసీ, రైల్వే ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేపట్టారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపైనా దృష్టి సారించారు. 
 
స్థానిక వంటకాలకు ప్రాధాన్యం
ప్రయాణికులు తమ స్థానిక ఆహార పదార్థాలను సైతం పొందేలా కొత్త పాలసీని రైల్వే అధికారులు సిద్ధం చేస్తున్నారు. హైదరా బాదీ బిర్యానీ, తెలంగాణ ఇతర పిండివంట లు, ఆంధ్రా గోంగూర, ఆవకాయ, పూతరేకులు వంటివి రైల్లో అందజేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా కేటరింగ్‌ బాధ్యతను ఐఆర్‌సీటీసీ పరిధిలోకి తీసుకొ స్తారు. రైల్వే.. కేవలం రైళ్ల నిర్వహణకే పరిమితమవుతుంది. కొత్త పాలసీ అమల్లోకి వస్తే.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సుమారు 200 రైళ్లలో రోజుకు సగటున లక్ష మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement