
హైదరాబాద్‌లో భారీగా పాతనోట్లు స్వాధీనం
హైదరాబాద్: పెద్ద నోట్లరద్దు జరిగి ఐదు నెలలు గడిచిపోయినా కొన్ని ముఠాలు రద్దయిన పెద్దనోట్ల మార్పిడి కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో భాగ్యనగరంలో నోట్ల మార్పిడికి పాల్పడుతోన్న 8 మందిని అరెస్ట్ చేసి, వారిద్ద నుంచి కోట్లరూపాయల విలువచేసే రద్దయిన పెద్దనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ నార్త్‌జోన్ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. మీడియాతో డీసీపీ మాట్లాడుతూ.. నోట్లు మార్పిడి సమాచారం అందుకున్న పోలీసులు నోట్ల దందా ముఠా వద్ద నుంచి 4.41 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయని చెప్పారు.
పట్టుబడ్డ వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులని, వీరిలో కళ్యాణ్ ప్రసాద్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని తెలిపారు. వందకు ముప్పై శాతం కమీషన్ తో నోట్లు మార్చడానికి ముఠా సభ్యులు డీల్ పెట్టుకున్నారని గుర్తించారు. రాజు అనే మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ముఠాకు ఏ బ్యాంకు సిబ్బందితోనూ సంబంధాలు లేవని స్పష్టం చేశారు.