మహానగరి... బోనాల సిరి
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
జంట నగరాల్లో వెల్లివెరిసిన ఆధ్యాత్మిక శోభ
పటిష్ట బందోబస్తు
చార్మినార్: డప్పు దరువులు... పోతురాజుల విన్యాసాలు... ఫలహార బండ్ల ఊరేగింపు.....బోనాలు...తొట్టెల సమర్పణతో పాతబస్తీలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ వె ల్లివెరిసింది. పాతబస్తీ సహా న గరంలోని ప్రధాన అమ్మవారి దేవాలయాలన్నీ ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులతో సందడిగా మారాయి. ఆలయాల్లో లక్ష అక్షితార్చన, కౌమారి పూజ, ఘటస్థాపన, లక్ష బిల్వార్చాన, దీపోత్సవం, శాకంబరి పూజ, లక్ష పుష్పార్చన, లక్ష కుంకుమార్చన, నవ చండీ హవనం, దేవీ మహాభిషేకం ఘనంగా నిర్విహంచారు. అనంతరం భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.
పట్టు వస్త్రాల సమర్పణ
లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటు పాతబస్తీలోని ప్రధానఆలయాల్లోని అమ్మవార్లకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు హన్మంతరావు, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు అమ్మవార్లను దర్శించుకున్నారు. వీఐపీల తాకిడితో సాధారణ భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆలయాలు కిటకిట
మహిళా భక్తులు తెల్లవారు జాము నుంచే లాల్‌దర్వాజ సింహవాహిని దేవాలయం అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ కట్టారు. భక్తుల రద్దీతో పరిసర రోడ్లన్నీ కళకళలాడాయి. పాతబస్తీలోని మీరాలంమండి మహంకాళి అమ్మవారి దేవాలయం, ఉప్పు గూడ మహంకాళి దేవాలయం, సుల్తాన్‌షాహి శీతల్‌మాత జగదాంబ మహంకాళి దేవాలయం, గౌలిపురా నల్లపోచమ్మ దేవాలయం, గౌలిపురా మహంకాళి దేవాలయం, మురాద్‌మహల్ మహంకాళి దేవాయలం, అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయం, బేలాముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి బంగారు మైసమ్మ ఆలయం, రాంబక్షి బండ అమ్మవారి దేవాలయం, మేకలబండ నల్లపోచమ్మ దేవాలయం, కోట్ల అలిజా కోట మైసమ్మ, కసరట్టా శ్రీ మహంకాళి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. డప్పు దరువులు, పోతురాజుల విన్యాసాల మధ్య మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం ముందు నిర్వాహకులు ఏర్పాటు చేసిన భారీ బోనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
భారీ బందోబస్తు
బోనాలకు దక్షిణ మండల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షించారు.