
ప్రతీ పోలీసుస్టేషన్‌లో ఇంకుడుగుంత: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ప్రతీ పోలీసుస్టేషన్ ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడుగుంతను తవ్వాలని డీజీపీ అనురాగ్‌శర్మ పోలీసులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో నీటి కోసం ఇబ్బందులు పడకుండా ప్రతీ నీటిచుక్కను ఒడిసి పట్టుకోవాలని సూచించారు. సోమవారం ఇక్కడ పోలీసు ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతల కార్యక్రమంలో డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు.
ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో వారంలో ఒకరోజు స్వచ్ఛ తెలంగాణను పాటించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఐజీ సంజయ్‌కుమార్ జైన్, ఎస్పీ రమేష్‌రెడ్డిలతో కూడిన అధికారుల బృందం డీజీపీ కార్యాలయంలోని అన్ని సెక్షన్లను పరిశీలించింది. డీజీపీ కార్యాలయంలో అత్యంత పరిశుభ్రతను పాటిస్తున్న సీ-సెక్షన్ కు డీజీపీ ప్రోత్సాహక బహుమతిగా రూ.2 వేలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ పోలీసు అధికారులు గోపీకృష్ణ, కృష్ణప్రసాద్, రవిగుప్తా, సందీప్ శాండిల్య, బాలనాగదేవి, నవీన్‌చంద్, శివధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.