అసలు నిందితులెవరు?
* ఒకే హత్య కేసులో వేర్వేరు నిందితుల అరెస్టు
* కొత్త మలుపు తిరిగిన జంగయ్య హత్య కేసు
* వారం క్రితమే ముగ్గురిని అరెస్టు చేసిన మీర్‌పేట పోలీసులు
* రెండు రోజుల క్రితం ఇదే కేసులో వేరే నలుగురి అరెస్టు చూపిన ‘పట్నం’ పోలీసులు
* రెండు ఠాణాల కథనంలో ఏది నిజం..?
సాక్షి, సిటీబ్యూరో: ఒకే హత్య కేసులో రెండు పోలీస్‌స్టేషన్ల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి రిమాండ్ డైరీలో నిందితులను వేర్వేరుగా చూపడం సంచలనం సృష్టిస్తోంది. ఇబ్రహీంపట్నం, మీర్‌పేట్ పోలీసుల వ్యవహార శైలి పోలీస్‌మార్క్ న్యాయాన్ని తలపిస్తోంది. సర్వత్రా చర్చనీయాంశమైన ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు..ఎవరిది ఒప్పు అనే విషయం నిగ్గు తేల్చేందుకు విచారిస్తున్నామని ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే...మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో...
గతనెల 30వ తేదీ రాత్రి మీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపూర్ మండలం వాయిల్లపల్లి జనగాం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జంగయ్య (35) హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ హత్య కేసులో మీర్‌పేట పోలీసులు హతుడి స్నేహితులైన ఆటో డ్రైవర్లు కొత్తపల్లి రమేష్ (25), టేకుమత్తుల రమేష్ (26), రేపాక రాజు (30)లను ఈనెల 16న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు చర్లపల్లి జైలులో ఉన్నారు. నిందితుల్లో ఒకడైన రాజు ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు సొంత సోదరుడు.
తన భార్యతో హతుడు జంగయ్య సన్నిహితంగా ఉంటున్నాడని గ్రామస్తులు చెప్పడంతో కొత్తపల్లి రమేష్ అతనిపై కక్షపెంచుకున్నాడని, అలాగే, రూ. 60 వేల బాకీ విషయంలో టేకుమత్తుల రమేష్‌కు జంగయ్య మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, వీరిద్దరూ రాజుతో కలిసి పథకం పన్ని హత్య చేశారని రిమాండ్ రిపోర్టులో మీర్‌పేట పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి హతుడి ఆటోతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఉండగానే ఇబ్రహీంపట్నం కానిస్టేబుల్ తను సోదరుడు రాజును కేసులోంచి తప్పించేందుకు మరికొందరితో కలిసి ప్రయత్నించి.. బోల్తాపడ్డాడు.
ఇబ్రహీంపట్నం పోలీసులు...
ఈనెల 1న ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో ఐటీఐ చదువుతూ ఆటో నడుపుతున్న బడంగ్‌పేటకు చెందిన అభిమన్యు (19) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతని స్నేహితులు బాలాపూర్‌కు చెందిన లక్ష్మణ్‌నాయక్ (19), సాయితేజ (19), శేఖర్ (19), కార్తీక్ (19)లను ఈనెల 19న ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు రమేష్ (19), రఘవాచారి (19) పరారీలో ఉన్నారని రిమాండ్ డైరీలో పేర్కొన్నారు.
అభిమన్యు హత్యకు ఒక రోజు ముందు అంటే గత నెల 30న మీర్‌పేట ఠాణా పరిధిలో ఆటో డ్రైవర్ జంగయ్యను కూడా తామే హత్య చేశామని నిందితులు వెల్లడించారని ఇబ్రహీంపట్నం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ డైరీలో పేర్కొన్నారు. జంగయ్యను హత్య చేసింది సాయితేజ, శేఖర్, కార్తీక్‌తో పాటు పరారీలో ఉన్న రమేష్, రాఘవాచారిలేనని కూడా నిందితుల వాంగ్మూలంలో పేర్కొన్నారు.
అనుమానాలెన్నో..?
* ఇంతకీ జంగయ్యను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసిన నిందితులే చంపారా? లేక ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసిన వారు చంపారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
* అయితే, మేము చేసిందే నిజమైన దర్యాప్తు, మేము పట్టుకున్న వారే అసలైన నిందితులని ఇటు మీర్‌పేట, అటు ఇబ్రహీంపట్నం పోలీసులు చెబుతున్నారు.
* శాస్త్రీయంగా ఆలోచిస్తే మాత్రం ఇద్దరిలో ఒకరు చెప్తున్నదే నిజం. మరొకరిది అబద్ధం.
* అబద్ధం చెప్పాల్సిన అవసరం, కేసును తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఎవరికుంది?.
* కానిస్టేబుల్ సోదరుడు రాజును కేసు నుంచి తప్పించకపోవడంతో మొత్తం కేసునే తారుమారు చేయాలనుకున్నారా?.
* అభిమన్యును చంపిన నిందితులను భయపెట్టి వారికి అంజయ్య హత్య కేసు కూడా అంటగడుతున్నారా?
* మీర్‌పేట పోలీసులు నిందితుల నుంచి అంజయ్య సెల్‌ఫోన్‌తో పాటు అతని ఆటోనూ సీజ్ చేశారు.
* హత్య అనంతరం ఆంజయ్య ఆటోను ఎల్బీనగర్‌లోని ప్రైవేట్ ఆటో స్టాండ్‌లో పార్కింగ్ చేసినట్లు రాజు సంతకం పెట్టిన దాఖలాలు ఉన్నాయి.
* పార్కింగ్ వారు ఇచ్చిన రసీదును సైతం రాజు నుంచి మీర్‌పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* వీరు అసలైన హంతకులు కాకపోతే , వీరి వద్ద అంజయ్య సెల్‌ఫోన్, ఆటో ఎలా ఉంటుంది.
* ఇబ్రహీంపట్నం పోలీసులు నిందితుల నుంచి అంజయ్య ఉంగరం (బంగారం కాదు) సీజ్ చేశామంటున్నారు.
* అసలు ఈ ఉంగరం అంజయ్యదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* ఎందుకూ పనికిరాని ఉంగరాన్ని నిందితులు ఎందుకు దొంగిలిస్తారు.
* ఉంగరం దొంగిలించిన నిందితులు హతుడి జేబులోని సెల్‌ఫోన్‌ను ఎందుకు దొంగిలించలేదు?