సినిమా షూటింగ్‌లో అపశ్రుతి
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
హైదరాబాద్: యువ నటుడు నాని నటిస్తున్న సినిమా షూటింగ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. షూటింగ్ స్పాట్‌లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పత్తిలికాయ తిరుపతి (25) కొండాపూర్‌లోని సిద్దానగర్‌లో నివసిస్తూ సినిమా షూటింగ్ వాహన క్లీనర్‌గా, లైట్‌వున్‌గా పనిచేస్తున్నాడు. శ్రీదేవి మూవీస్ పతాకంపై యువ హీరో నాని, సురభి థామస్‌లు జంటగా కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ గత రెండు రోజులుగా సంఘీనగర్‌లోని సంఘీనగర్ సర్పంచ్, సంఘీ స్పిన్నర్స్ యజమాని అమిత్‌సంఘీ గెస్ట్‌హౌస్‌లో జరుగుతోంది. శనివారం ఉదయం 8.30 గంటలకు షూటింగ్ ప్రారంభం కాగానే బస్సును శుభ్రపరుస్తుండగా తిరుపతి అకస్మాత్తుగా కిందపడిపోయాడు.
ఫిట్స్ వచ్చాయనే అనుమానంతో తోటి కార్మికులు అతని చేతిలో తాళాలు ఉంచి హయత్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా తిరుపతి షార్ట్ సర్క్యూట్ కారణంగానే మృతి చెందాడని, షూటింగ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి సొంత గ్రామానికి తరలించే ప్రయత్నం చేశారని వదంతులు పుట్టాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న మృతుని బంధువులు తిరుపతికి ఇప్పటివరకు ఎలాంటి ఫిట్స్ రాలేదని, ఆరోగ్యంగా ఉన్నాడని.. హఠాత్తుగా ఎలా చనిపోయాడని ప్రశ్నిస్తున్నారు.
షూటింగ్‌కు అనుమతులు లేవు
అమిత్‌సంఘీ గెస్ట్‌హౌస్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవని హయత్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారణాలు తెలుసుకుంటామని అన్నారు. అనుమతులు లేకుండా షూటింగ్ నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.