సోమవారం ఫీవర్ ఆస్పత్రిలో బారులు తీరిన రోగులు
► ‘ఓపీ’క లేక సొమ్మసిల్లుతున్న రోగులు
► రిపోర్టు తీసుకొచ్చే సరికి వైద్యులుగాయబ్
► సాధారణ చికిత్సలకు తప్పని పడిగాపులు
► ఉస్మానియా సహా అన్ని ఆస్పత్రుల ఓపీలు కిటకిట
సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఆస్పత్రికి వచ్చిన జ్వర పీ డితులకు నేడు కనీస సూదిమందు కూడా వేయలేకపోతున్నారు. సుస్తీ చేసిన ఆస్పత్రికి ఎప్పటికపుడు చికిత్స చేసి గాడిలో పెట్టాల్సిన అధి కారులు దానిని పట్టించుకోవడమే మానేశారు. సాధారణ రోజుల్లో ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 600–700 మంది రో గులు వస్తుంటారు. ఇటీవల ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఓపీకి 2000 మందికి పైగా వస్తున్నారు. అయితే రోగుల సంఖ్యకు తగినన్ని ఓపీ కౌంటర్లు లేక పోవడంతో ఓపీ టికెట్లు తీసుకునేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడంతో తరచూ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. దీనికితోడు జ్వరాలతో బాధపడుతున్న వారు క్యూ లైన్లలో నిరీక్షించ లేక సొమ్మసిల్లి పడిపోతున్నా, పట్టించుకునేవారు కరువయ్యారు.
ఇటీవల రోగుల తాకిడి పెరగడంతో ఓపీ, ఫార్మసీల సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకు పొడిగించడమేగాక రోగుల రద్దీ దృష్ట్యా ఉస్మానియా నుంచి ఇద్దరు సీనియర్ వైద్యులను డిప్యూటేషన్‌పై ఇక్కడికి పంపినట్లు ప్రభుత్వం పేర్కొన్నా రోగుల అవసరాలు తీరడం లేదు. ఒ క్కో వైద్యుడు రోజుకు సగటున 150–200 మంది రోగులను చూడాల్సి వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈఎన్‌టీ వైద్యుడు లేక పోవడంతో డిఫ్తీరియాతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వారిని ఉస్మానియాకు సిఫార్సు చేస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి విషమించి 11 మంది డిఫ్తీరియాతో మృతి చెందడం విశేషం.
అందరూ జూనియర్లేః
నగరంలోని ఉస్మానియా, గాంధీ, సుల్తాన్‌బజార్, నిలోఫర్, పేట్లబురుజు, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో సగటున 2000–3000 మంది రోగులు వస్తుంటారు. ఉదయం ఏడు గంటలకు ఓపీ కౌంటర్‌కు చేరుకుని రెండు గంటలకుపైగా క్యూలైన్‌లో నిలబడి టోకెన్ తీసుకుని ఓపీకి వెళ్తే తీరా అక్కడ జూనియర్ డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఒక వేళ సీనియర్లు ఉన్నా...రక్త, మూత్ర పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వచ్చేలోగా వారు అక్కడినుంచి వెళ్లి పోతున్నారు. దీంతో సాధారణ చికిత్సల కోసం రెండు మూడు రోజులు ఆస్పత్రిలోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది.