'స్వచ్ఛ హైదరాబాద్' కేవలం ప్రచార ఆర్భాటమే
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటమే అని తేలిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఎద్దేవా చేశారు. పరిశుభ్రతపై కేంద్రం నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరానికి 275వ స్థానం రావడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్తలో లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ స్పష్టం చేసిన విషయాన్ని డీకే అరుణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటే ఉస్మానియా మరమ్మతులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా చారిత్రక కట్టడం దెబ్బతినకుండా బాగు చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. గాంధీ కుటుంబంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. అవి తప్పుడు ఆరోపణలు అని అరుణ స్పష్టం చేశారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు.